విండీస్ బ్యాటింగ్ దిగ్గజం ఎవర్టన్‌ వీక్స్‌ మృతి

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 02:59 PM

విండీస్ బ్యాటింగ్ దిగ్గజం ఎవర్టన్‌ వీక్స్‌ మృతి

క్రికెట్ ప్రపంచంలో త్రీ డబ్ల్యూస్‌ అప్పట్లో బాగా ఫేమస్. వెస్టిండీస్‌కి చెందిన ప్రాంక్‌ వారెల్‌, క్లయిడ్‌ వాల్కట్‌, ఎవర్టన్‌ వీక్స్‌లు.. దశాబ్దంపాటు వరల్డ్‌ క్రికెట్‌ని శాసించారు. ఈ ముగ్గురిలో ఒకడైన ఎవర్టన్‌ వీక్స్‌ (95) బుధవారం మృతి చెందాడు. 2019లో గుండెపోటు రావడంతో అప్పటి నుంచి అనారోగ్యంతో ఎవర్టన్‌ వీక్స్‌ బాధపడుతున్నాడు. వెస్టిండీస్ తరఫున 1948-58 మధ్య కాలంలో టెస్టులాడిన ఎవర్టన్‌ వీక్స్‌.. 58.62 సగటుతో 4,455 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు ఉండగా.. 1948లో ఇంగ్లాండ్, భారత్‌పై వరుసగా ఐదు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు నమోదు చేశాడు. క్రికెట్ ప్రపంచంలో మరే క్రికెటర్ కూడా టెస్టుల్లో ఇలా వరుసగా ఐదు సెంచరీలు బాదలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు.. ఫస్ట్ క్లాస్‌లోనూ ఎవర్టన్‌ వీక్స్‌‌కి మెరుగైన రికార్డ్ ఉంది. కెరీర్‌లో 152 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఎవర్టన్‌ వీక్స్‌ 55.34 సగటుతో 12,010 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 304 పరుగులు.. అది కూడా నాటౌట్. ‘‘వెస్టిండీస్ క్రికెట్‌కి ఎవర్టన్‌ వీక్స్‌ మార్గదర్శకుడు. అద్భుతమైన క్రికెటర్.. మంచి మనసున్న వ్యక్తి కూడా. అతని ఆత్మకి శాంతి చేకూరాలి’’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రికీ స్కెరిట్ నివాళి అర్పించాడు. రిటైర్మెంట్ తర్వాత సుదీర్ఘకాలం ఐసీసీ మ్యాచ్ రిఫరీగా కూడా ఎవర్టన్‌ వీక్స్‌ పనిచేశాడు. దాంతో.. ఐసీసీతో పాటు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా అతనికి నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు.






Untitled Document
Advertisements