మధ్యప్రదేశ్ కేబినెట్: రెబెల్స్‌కు మంత్రి పదవులు!

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 05:05 PM

మధ్యప్రదేశ్ కేబినెట్: రెబెల్స్‌కు మంత్రి పదవులు!

మధ్యప్రదేశ్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ తన మంత్రిమండలిని ఎట్టకేలకు విస్తరించారు. భోపాల్‌లో ఈ రోజు ఉదయం 28 మందితో గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అందులో 20 మంది మంత్రులుగా, ఎనిమిది మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రిమండలి విస్తరణ అంశం గత మూడు నెలలుగా వాయిదాపడుతూ వస్తున్న విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మార్చి నెలలో సీఎంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు.కమల్‌నాథ్‌తో ఏర్పడిన విభేధాలతో కాంగ్రెస్‌ పార్టీకి మార్చి 10న రాజీనామా చేసిన సింధియా బీజేపీలో చేరారు. సింధియాతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆ ప్రభుత్వం కూలి.. శివరాజ్ సింగ్ సర్కార్ ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల తర్వాత మంత్రిమండలిలోకి ఐదుగురిని తీసుకున్నారు.

అయితే రాజ్యసభ ఎన్నికలతోపాటు, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎవరెవరికి మంత్రిమండలిలో చోటుకల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో క్యాబినెట్‌ విస్తరణ వాయిదాపడుతూ వస్తున్నది.
ఎట్టకేలకు ఇవాళ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమార్తి దేవి, ప్రభురామ్ చౌదరి, ప్రధుమాన్ సింగ్ తోమర్‌తో పాటు జ్యోతిరాదిత్య సింథియా విధేయులు, ఆయన అత్తమ్మ, బీజేపీ ఎమ్మెల్యే అయిన యశోధర రాజె సింథియా కూడా ఉన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ విస్తరణ పూర్తయిన వెంటనే.. మంత్రులందరితో సీఎం సమావేశం కూడా నిర్వహించారు.






Untitled Document
Advertisements