ధోనీని అర్థం చేసుకునేందుకు ఆరేళ్ళు పట్టింది: ఇషాంత్

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 01:51 PM

ధోనీని అర్థం చేసుకునేందుకు ఆరేళ్ళు పట్టింది: ఇషాంత్

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఔనత్వాన్ని అర్థం చేసుకునేందుకు తనకి ఆరేళ్లు సమయం పట్టిందని ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ వెల్లడించాడు. 2007లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా ఇషాంత్ శర్మ.. కెరీర్ ఆరంభంలో ధోనీతో పెద్దగా మాట్లాడేవాడు కాదట. కానీ.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో యువ క్రికెటర్లతో ధోనీ వ్యవహరిస్తున్న తీరుకి తాను ఫిదా అయిపోయినట్లు ఈ పేసర్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాతే ధోనీని అర్థం చేసుకోవడం తాను ప్రారంభించానని ఇషాంత్ శర్మ వివరించాడు.



స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ కనెక్టెడ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీతో ఉన్న సాన్నిహిత్యం గురించి ఇషాంత్ శర్మ మాట్లాడుతూ ‘‘భారత్ జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో ధోనీతో నేను పెద్దగా మాట్లాడేవాడిని కాదు. కానీ.. 2013 తర్వాత అతనితో నెమ్మదిగా మాట్లాడుతూ.. క్రమంగా అర్థం చేసుకోవడం ప్రారంభించా. యువ క్రికెటర్లతో ధోనీ చక్కగా మాట్లాడతాడు. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా వారితో అలానే కూల్‌గా అతను వ్యవహరిస్తాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? నా రూముకి రావొద్దు అని ధోనీ ఎవరితోనూ చెప్పడు. బౌలర్ మహ్మద్ షమీ ఎక్కువగా ధోనీ రూముకి వెళ్తుంటాడు. ధోనీతో మాట్లాడితే క్రికెట్ గురించే కాదు.. జీవితం గురించి కూడా చాలా నేర్చుకోవచ్చు’’ అని ఇషాంత్ శర్మ వెల్లడించాడు.

భారత్ తరఫున 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లాడిన ఇషాంత్ శర్మ.. మొత్తం 420 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో మరీ ముఖ్యంగా.. విదేశాల్లో భారత ప్రధాన బౌలింగ్ అస్త్రం ఇషాంత్ శర్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు.





Untitled Document
Advertisements