40లోకి అడుగుపెట్టిన హర్భజన్ సింగ్!

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 05:50 PM

40లోకి అడుగుపెట్టిన హర్భజన్ సింగ్!

భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈరోజు 40వ పడిలోకి అడుగుపెట్టాడు. 1998లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన హర్భజన్.. టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా 2001లో అరుదైన ఘనత సాధించాడు. స్వతహాగా ముక్కోపి అయిన హర్భజన్ సింగ్ మైదానంలో తన నోటి దురుసు, చర్యలతో ఎన్నోసార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. కొన్ని సందర్భాల్లో అతని కెరీర్ ఇక ముగిసిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ.. ఇప్పటికీ.. ఐపీఎల్ లాంటి టోర్నీలో భజ్జీ తన జోరుని కొనసాగిస్తున్నాడు.
1980, జూలై 3న పంజాబ్‌లో జలంధర్‌లో జన్మించిన హర్భజన్ సింగ్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలినాళ్లలోనే తన బౌలింగ్ యాక్షన్‌తో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ.. అందరికీ తన ప్రదర్శనతోనే బదులిచ్చిన భజ్జీ.. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఒంటిచేత్తో టీమిండియాకి విజయాల్ని అందించాడు. మూడు టెస్టుల ఆ సిరీస్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టడమే కాకుండా.. ఏకంగా 32 వికెట్లని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అనిల్ కుంబ్లేతో కలిసి ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్‌‌ విజయాలకి హర్భజన్ బాటలు వేశాడు. 2016లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లాడిన హర్భజన్ సింగ్.. 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20ల్లో కలిపి మొత్తం 711 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్‌ 2008 సీజన్‌లో తనని కవ్వించిన సహచర బౌలర్ ఎస్.శ్రీశాంత్‌పై చేయి చేసుకుని నిషేధానికి గురైన హర్భజన్ సింగ్.. అదే ఏడాది ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ని కోతితో పోల్చి ‘మంకీ గేట్’ వివాదానికి తెరలేపాడు. ఈ రెండు సందర్భాల్లోనూ హర్భజన్ సింగ్ కెరీర్ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ.. గోడకి కొట్టిన బంతిలా మళ్లీ మైదానంలోకి దూసుకొచ్చిన భజ్జీ.. 2011 వన్డే ప్రపంచకప్‌‌లోనూ భారత్‌కి ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న హర్భజన్ సింగ్.. ఛాన్స్‌ దొరికితే మళ్లీ టీమిండియాకి ఆడేందుకు సిద్ధమేనని ఇటీవల ప్రకటించాడు. ఆఖరిగా హ్యాపీ బర్త్‌ డే హర్భజన్ సింగ్.





Untitled Document
Advertisements