తెలంగాణ దీన పరిస్థితి: కరోనా పాజిటివ్ ల జాబితాలో టాప్...టెస్టుల విషయంలో డౌన్!!!

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 11:54 AM

తెలంగాణ దీన పరిస్థితి: కరోనా పాజిటివ్ ల జాబితాలో టాప్...టెస్టుల విషయంలో డౌన్!!!

తెలంగాణలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎక్కువ కేసులు హైదరాబాద్ నగరంలోనే నమోదవుతున్నప్పటికీ.. జిల్లాల్లోనూ కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. శుక్రవారం రాత్రి వెలువరించిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 1,04,118 మందికి కరోనా టెస్టులు చేయగా... 20,462 మందికి పాజిటివ్ అని తేలింది. అంటే 19.65 శాతం కేసులు పాజిటివ్‌గా తేలాయి. మరింత వివరంగా చెప్పాలంటే.. టెస్టు చేసిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కోవిడ్ నిర్ధారణ అవుతోంది. ఇవి ఓవరాల్ గణాంకాలు కాగా.. ఇటీవలి కాలంలో కరోనా పాజిటివ్ రేటు చాలా ఎక్కువగా ఉంది. శుక్రవారం 5965 శాంపిళ్లను పరీక్షించగా.. 1892 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలాయి. అంటే పాజిటివ్ రేటు 31.71 శాతంగా ఉంది. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు తగ్గుతుండగా.. తెలంగాణలో పెరుగుతుండటం గమనార్హం. అదే సమయంలో ఆయా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నారు.

గురువారం నాటికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే కోవిడ్ పాజిటివ్ రేటు ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 1.86 లక్షల కేసులు నమోదైనప్పటికీ అక్కడ 10.23 లక్షల టెస్టులు చేశారు. ఆ రాష్ట్రంలో పాజిటివ్ రేటు 18.24 శాతంగా ఉంది. తమిళనాడులో కరోనా కేసులు
లక్ష దాటినప్పటికీ.. 12.35 లక్షలకుపైగా శాంపిళ్లను టెస్టు చేశారు. అక్కడ పాజిటివిటీ రేటు 8 శాతం లోపే ఉంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 16.10 శాతంగా ఉంది.

పొరుగున ఉన్న ఏపీలో 9.71 లక్షల కరోనా టెస్టులు చేయగా.. 17 వేలలోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రాలో పాజిటివ్ రేటు 1.74 శాతం మాత్రమే కావడం గమనార్హం. మరి ఇదే స్థాయిలో తెలంగాణలోనూ టెస్టులు చేస్తే ఎంత మందికి పాజిటివ్ అని తేలుతుందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దేశం మొత్తం మీద కరోనా పేషెంట్ల రికవరీ రేటు 60 శాతం ఉండగా.. తెలంగాణలో అది 50 శాతం లోపే ఉంది. మరణాల రేటు మాత్రం జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో తక్కువగా ఉంది. పెద్ద రాష్ట్రాల్లో బిహార్‌లో మాత్రమే తెలంగాణలో కంటే తక్కువ టెస్టులు చేస్తున్నారు. గురువారం ఉదయం వరకు తెలంగాణలో ప్రతి పది లక్షల మందిలో 2361 మందికి కరోనా టెస్టులు చేయగా.. బిహార్‌లో 1859 టెస్టులు చేశారు.





Untitled Document
Advertisements