చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధ నౌకలు!

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 02:13 PM

చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధ నౌకలు!

భారత్‌ సరిహద్దుల్లో దురాక్రమణకు పాల్పడుతోన్న చైనా.. అటు జల భాగాలను కూడా పొరుగు దేశాల నుంచి లాక్కునే ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని పలు దీవులను ఇప్పటికే తన నియంత్రణలోకి తెచ్చుకున్న చైనా.. మరిన్ని ప్రాంతాలపై కన్నేసింది. తన ప్రాబల్యాన్ని పెంచుకోడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా పారాసెల్ దీవులకు సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. చైనా చర్యలను అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
భారత్‌తో సరిహద్దుల్లో ఘర్షణ.. దక్షిణ చైనా సముద్రంలో విన్యాసాల నేపథ్యంలో అమెరికా తన యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలోకి పంపుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిలిప్పీన్స్ సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో యూఎస్ఎస్ నిమిట్జ్, యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్‌లు సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయని అమెరికా నేవీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జో జీలే అన్నారు.

ఫిలిప్పీన్ సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో విన్యాసాలు నిర్వహించడం మా దళాలకు అధునాతన శిక్షణా అవకాశాలతోపాటు ప్రాంతీయ పరిస్థితులకు ప్రతిస్పందనగా కమాండర్ల అప్రమత్తంగా ఉండేందుకు గణనీయమైన కార్యాచరణ సౌలభ్యాన్ని అందజేస్తున్నాయని అన్నారు. అంతేకాదు, యుద్ధ నౌకలు దక్షిణ చైనా సముద్రంలోకి రావడం వెనుక ఎలాంటి రాజకీయ, ప్రపంచ సంఘటనలకు ప్రతిస్పందన కాదు. ఇండో-పసిఫిక్ అంతటా అమెరికా నౌకాదళ భద్రత, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించే అనేక మార్గాలలో ఈ అధునాతన సామర్ధ్యం ఒకటి’అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. వివాదాస్పద సముద్ర జలాల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించడంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తీవ్రంగా మండిపడ్డారు. ‘దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సైనిక విన్యాసాలు నిర్వహించి, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్న తమ ఆగ్నేయాసియా మిత్రుల వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం.. డ్రాగన్ చట్టవిరుద్దమైన కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నాం’ అంటూ మైక్ పాంపియో శుక్రవారం ట్విట్టర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.



అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ సైతం రెండు రోజుల కిందట ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా సైనికి విన్యాసాలను చట్టవిరుద్దమైన చర్యగా అభివర్ణించిన పెంటగాన్.. దక్షిణ చైనా సముద్రంలోని పొరుగు దేశాలకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

దక్షిణా చైనా సముద్రంలోని పార్సెల్ దీవులు, వియత్నాంలోని హోయాంగ్ సా ద్వీప సమూహంపై వివాదం నెలకుంది. ఇక్కడ 30కిపైగా దీవులు చైనా నియంత్రణలో ఉన్నాయి. కానీ ఆ దీవులపై తమకూ హక్కు ఉందని తైవాన్, వియత్నాం వాదిస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతం కావడంతోపాటు దక్షిణ చైనా సముద్రం అడుగున ఉన్న ఖనిజ సంపదపై చైనా కన్నేసింది. ఈ సాగర జలాలపై తమకే హక్కు ఉందని చైనా పేర్కొంటుండగా.. వియత్నాం, తైవాన్‌తోపాటు ఫిలిప్పిన్స్, బ్రూనై, మలేసియా, ఇండోనేసియా దేశాలు తమకు కూడా హక్కుందని వాదిస్తున్నాయి. దీంతో దక్షిణ చైనా సముద్రం వివాదాస్పదంగా మారింది.





Untitled Document
Advertisements