మేడిన్ ఇండియా: దేశంలో 11,300 వెంటిలేటర్ల తయారీ

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 03:33 PM

మేడిన్ ఇండియా: దేశంలో 11,300 వెంటిలేటర్ల తయారీ

దేశీయంగా (మేడిన్ ఇండియా) 11,300 వెంటిలేటర్లు తయారు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ శనివారం వెల్లడించారు. ఇప్పటి వరకూ 6,154 వెంటిలేటర్లను హాస్పిటల్స్‌కు అందజేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా 1.02 లక్షల ఆక్సిజన్ సిలిండర్లను కేంద్ర ఆరోగ్య శాఖ సరఫరా చేసిందని, వీటిలో 72,293 ఆస్పత్రులకు చేరినట్టు ట్విట్టర్‌లో తెలిపారు. దేశవ్యాప్తంగా 6.12 కోట్ల హైడ్రాక్సీక్లోరీక్విన్ మాత్రలను పంపిణీ చేసినట్టు వివరించారు.
ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా రెండు కోట్లకుపైగా ఎన్‌95 మాస్క్‌లు, కోటికిపైగా పీపీఈ కిట్‌లను ఉచితంగా అందజేశాం.. అలాగే ఢిల్లీలో 7.81 లక్షల పీపీఈ కిట్లు, 12.76 లక్షల ఎన్95 మాస్కులు సరఫరా చేశాం.. మహారాష్ట్రకు 11.78 లక్షల పీపీఈ కిట్లు, 20.64 లక్షల ఎన్95 మాస్క్‌లు అందజేసినట్టు తెలిపారు.

మరోవైపు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మహా ఉద్ధృతంగా ఉంది. రెండు రోజుల కిందటి వరకు సగటున 19వేలు కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 20వేలను దాటేసింది. శుక్రవారం ఏకంగా 23వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేవలం రెండు రోజుల్లో కరోనా కేసులు 45వేలుగా నమోదుకావడం దేశంలో మహమ్మారి విజృంభణకు అద్దం పడుతోంది.

దేశవ్యాప్తంగా మరో 446 మంది కరోనాతో చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 649,708కి చేరగా.. మరణాల సంఖ్య 18,667కి చేరింది. అయితే, కరోనా బాధితుల రికవరీ రేటు మాత్రం ఎక్కువగా ఉండటం సానుకూలంశం. రికవరీ రేటు 60 శాతం ఉండగా.. ఇప్పటి వరకూ కరోనా నుంచి 3.95 లక్షల మంది కోలుకోగా.. 2.36 లక్షల మంది వివిధ ఆస్పత్రులు, కోవిడ్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.





Untitled Document
Advertisements