హైదరాబాద్ లో తెరుచుకోనున్న చార్మినార్, గోల్కొండ కోటలు!

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 04:36 PM

హైదరాబాద్ లో తెరుచుకోనున్న చార్మినార్, గోల్కొండ కోటలు!

కరోనా వైరస్ దెబ్బకు రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. కాగా సోమవారం (జులై 6) నుంచి హైదరాబాద్ నగరంలోని చార్మినార్, గోల్కొండ కోటలోకి పర్యాటకులను అనుమతించనున్నారు. ఒక రోజులో గరిష్టంగా 2 వేల మంది పర్యాటకులను మాత్రమే అనుమతిస్తామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు తెలిపారు. ఎంట్రీ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తామన్నారు. కౌంటర్ల ద్వారా టికెట్ల అమ్మకాలను చేపట్టబోమన్నారు. పర్యాటకులు ఏఎస్ఐ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.


భద్రతా చర్యలు కచ్చితంగా పాటించేలా చూస్తామని అధికారులు తెలిపారు. చార్మినార్, గోల్కొండ కోట రీఓపెనింగ్ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ (హైదరాబాద్ సర్కిల్) మిలాన్ కుమార్ చౌలే అధికారులతో చర్చలు జరిపారు.

పర్యాటకులు కచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి ఉంటుంది. ఎంట్రన్స్‌లో పర్యాటకులు చేతులను శుభ్రం చేసుకోవడంతోపాటు థర్మల్ స్క్రీనింగ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. కరోనా లక్షణాలున్న వారిని అనుమతించరు. గ్రూప్ ఫొటోలు తీసుకోవడానికి అనుమతి లేదు. తినుబండారాలను అనుమతించరు. పార్కింగ్, కేఫ్‌టేరియాల్లో డిజిటల్ పేమెంట్లను మాత్రమే అనుమతిస్తారు. కేఫ్‌టేరియాలో కేవలం మంచినీళ్ల బాటిళ్లను మాత్రమే అది కూడా డిజిటల్ పేమెంట్ ద్వారా విక్రయిస్తారు.

హైదరాబాద్ నగర నిర్మాత అయిన కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్‌ను నిర్మించారు. ఆర్కియాలజీ విభాగం దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రతి నెలా లక్షలాది మంది ఈ కట్టడాన్ని సందర్శిస్తారు.

గోల్కొండ కోటను కుతుబ్ షాహీ నవాబుులు 1518 నుంచి 1687 సంవత్సరాల మధ్య నిర్మించారు. నిత్యం వేలాది మంది గోల్కొండ కోటను సందర్శిస్తుంటారు.





Untitled Document
Advertisements