గోల్డ్ బాండ్ల జారీ: మార్కెట్ రేటు కన్నా రూ.2వేలు తక్కువకే బంగారం!!!

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 04:39 PM

గోల్డ్ బాండ్ల జారీ: మార్కెట్ రేటు కన్నా రూ.2వేలు తక్కువకే బంగారం!!!

బంగారం కొనుగోలు చేయాలని యోచిస్తున్నారా? అయితే ఇప్పుడు బంగారం కొనాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే బంగారం ధర ఇప్పటికే రూ.50 వేల మార్క్‌ను దాటేసింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.51 వేల సమీపంలో కదలాడుతోంది. బంగారం కొనుగోలు కన్నా అందులో ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే కళ్లుచెదిరే లాభం పొందొచ్చు.

మార్కెట్ ధర కన్నా ఏకంగా రూ.2,300 తక్కువ ధరకే బంగారంలో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అందుబాటులో ఉంది. అవును బంగారం ధర రూ.51 వేలకు సమీపంలో ఉంటే.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా అయితే రూ.48,520కే బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది అదిరిపోయే ఆఫర్ అని చెపొచ్చు. కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020-21 సిరీస్ నాలుగో విడత జారీ జూలై 6 నుంచి ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధరను రూ.4,852గా నిర్ణయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఆంధ్రా బ్యాంక్ సహా పలు బ్యాంకుల్లో ఈ స్కీమ్‌ ద్వారా గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. అలాగే స్టాక్ ఎక్స్చేంజీలు, పోస్టాఫీసుల్లో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ బంగారం బాండ్లలో కొనుగోలు చేసే వారికి మరో తీపికబురు కూడా ఉంది. బ్యాంకులు లేదా స్టాక్ ఎక్స్చేంజీలు వంటి వాటికి వెళ్లి బంగారం బాండ్లు కొనడం కన్నా ఆన్‌లైన్‌లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేస్తే గ్రాముకు రూ.50 తగ్గింపు లభిస్తుంది. అంటే వీరికి గోల్డ్ బాండ్లు గ్రాముకు రూ.4802కే లభించినట్లు అవుతుంది. గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయాలని భావించే వారికి చాలా సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి. భారీ మొత్తంలో కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క గ్రాము దగ్గరి నుంచి కొనుగోలు చేయొచ్చు. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 4 కేజీల వరకు గోల్డ్ బాండ్లను కొనొచ్చు. అదే ట్రస్ట్‌లు, ఇతర సంస్థలు 20 కేజీల వరకు గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు.

గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసిన వారికి వాటిపై 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయంలో వడ్డీతోపాటు మీ బాండ్ల విలువకు సమానమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. సాధారణంగా బాండ్ల మెచ్యూరిటీ కాలం ఎనిమిదేళ్లు. గత మూడు వారాల్లోని 24 క్యారెట్ల బంగారం ధర సగటు ప్రాతిపదికన మీ బాండ్లకు డబ్బులు చెల్లిస్తారు.









Untitled Document
Advertisements