'విదేశాల్లో ఐపీఎల్ 2020...బీసీసీఐ లాస్ట్ ఆప్షన్'

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 05:50 PM

'విదేశాల్లో ఐపీఎల్ 2020...బీసీసీఐ లాస్ట్ ఆప్షన్'

విదేశాల్లో ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు నిర్వహించడమనేది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వద్ద ఉన్న చివరి ఆప్షన్ మాత్రమేనని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశాడు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి భారత్ వేదికగా ఐపీఎల్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. ఒకవేళ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు- నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడితే.. ఆ విండోలో ఐపీఎల్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోగా.. సెప్టెంబరు చివరి నాటికి కూడా పరిస్థితులు అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. దాంతో.. భారత్ వెలుపలే ఐపీఎల్‌ని నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు వెలువడగా.. టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని శ్రీలంక, యూఏఈతో పాటు న్యూజిలాండ్ దేశాల క్రికెట్ బోర్డులు ముందుకు వచ్చాయి. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ రద్దయితే బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోనుంది.

విదేశాల్లో ఐపీఎల్ వార్తలపై తాజాగా బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ ‘‘ఐపీఎల్‌ని సాధ్యమైనంత వరకూ భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా అనుకూలించకపోతే మాత్రమే విదేశాల్లో నిర్వహించడంపై ఆలోచిస్తాం. యూఏఈ, శ్రీలంక, న్యూజిలాండ్ దేశాల క్రికెట్ బోర్డు.. ఐపీఎల్ ఆతిథ్యంపై తమ ప్రతిపాదనలు పంపాయి. ఒకవేళ విదేశాల్లో టోర్నీని నిర్వహించాల్సి వస్తే..? అప్పుడు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించి.. ఎక్కడ నిర్వహించాలో నిర్ణయిస్తాం. మొత్తంగా.. విదేశాల్లో ఐపీఎల్ అనేది బీసీసీఐ వద్ద ఉన్న చివరి ఆప్షన్ మాత్రమే’’ అని వెల్లడించాడు.

భారత్‌లో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికా గడ్డపై ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలోనూ కొన్ని మ్యాచ్‌‌లకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మరోసారి ఐపీఎల్ ఆతిథ్య అవకాశం ఇవ్వాలని యూఏఈ కోరుతుండగా.. శ్రీలంక తమ దేశంలో కరోనా వైరస్ కేసులు తక్కువగా నమోదవడంతో.. ఎలాంటి ఆటంకాలు లేకుండా టోర్నీని నిర్వహిస్తామని హామీ ఇస్తోంది. ఇక న్యూజిలాండ్‌ కూడా ఆతిథ్యం రేసులోకిరాగా.. ఇటీవల ఆ దేశంలో ‘జీరో కరోనా కేసుల’ సెలబ్రేషన్స్ కూడా జరిగిన విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements