కేంద్రం కీలక నిర్ణయం..విద్యార్థుల 30 శాతం సిలబస్ తగ్గింపు!

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 08:16 PM

కేంద్రం కీలక నిర్ణయం..విద్యార్థుల 30 శాతం సిలబస్ తగ్గింపు!

కరోనా మహమ్మారితో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై భారం తగ్గించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 30 శాతం సిలబస్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 9 నుంచి 12 తరగతుల సిలబస్‌ను 30 శాతం తగ్గించాలని సీబీఎస్‌ఈకి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్డీ) సూచించింది. లాక్‌డౌన్‌తో విద్యా సంవత్సరం కోల్పోయిన నష్టాన్ని ఈవిధంగా పూడ్చాలని భావిస్తున్నట్లు హెచ్‌ఆర్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం (జులై 7) తెలిపారు.
సిలబస్‌ను తగ్గించే అంశంపై కొన్ని వారాల కిందట విద్యా నిపుణుల నుంచి సలహాలు ఆహ్వానించినట్లు మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. దీనిపై 1500 సలహాలు వచ్చినట్లు వెల్లడించారు. సూచనలు ఇచ్చిన వారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

అభ్యాస సాధన ప్రాముఖ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధాన అంశాలను కొనసాగిస్తూనే.. సిలబస్‌ను 30 శాతం వరకు హేతుబద్ధీకరించాలని నిర్ణయించినట్లు మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. దేశంలో, ప్రపంచంలో నెలకొన్న అసాధారణ పరిస్థితిని చూసి పాఠ్యాంశాలను సవరించాలని సీబీఎస్ఈకి సూచించినట్లు వివరించారు.కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ - 10, 12 తరగతులకు సంబంధించిన సిలబస్‌ను 25 శాతం తగ్గిస్తున్ననట్టుగా ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు.. ఎనిమిదో తరగతి, అంతకంటే తక్కువ తరగతులకు సీబీఎస్‌ఈ-అనుబంధ పాఠశాలలు సిలబస్‌ను సొంతంగా తగ్గించడానికి స్వేచ్ఛ ఇవ్వాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు.

కరోనా వైరస్ కట్టడి కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా మార్చి 16 నుంచి దేశంలో విద్యా సంస్థలు మూతబడ్డాయి. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు తెరిపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. పిల్లల ప్రాణాలను రిస్క్‌లో పెట్టే సాహసం చేయలేమని అధికారులు చెబతున్నారు. విద్యా సంస్థలపై ఆంక్షలు జులై 31 వరకు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది.

Untitled Document
Advertisements