పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పది రోజులు లాక్‌డౌన్

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 10:18 AM

పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పది రోజులు లాక్‌డౌన్

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పది రోజులుపాటు లాక్‌డౌన్ విధిస్తున్నారు. నేటి (జులై 13) నుంచి 10 రోజులపాటు స్వచ్ఛంద లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలోనే పట్టణంలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. ఎరువుల దుకాణాలు, నిత్యావసర సరుకులు, కూరగాయల వ్యాపారాలకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.



ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నుంచి కాపాడుకోవడానికి స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమన్నారు. పెద్దపల్లిలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోందన్న ఎమ్మెల్యే.. ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. వ్యాపారులు దుకాణాల వద్ద తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పెద్దపల్లి జిల్లాలో 104 మంది కరోనా బారిన పడగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజుల వ్యవధిలో జిల్లాలో 56 కేసులు నమోదయ్యాయి. ఆదివారం పెద్దపల్లి పట్టణంలో ముగ్గురు, గోదావరిఖనిలో ముగ్గురు చొప్పున కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ వ్యాప్తి తీవ్రం కావడంతో పెద్దపల్లి పట్టణంలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. గోదావరిఖనిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఇక్కడ కూడా లాక్‌డౌన్ విధించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.





Untitled Document
Advertisements