భారత్, చైనాల వివాదం...కొనసాగుతున్న ఉప-సంహరణ ప్రక్రియ

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 11:19 AM

భారత్, చైనాల వివాదం...కొనసాగుతున్న ఉప-సంహరణ ప్రక్రియ

సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య రెండు నెలల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇరు సైన్యాల ఉప-సంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇరు దేశాల మధ్య మ్యాప్‌ల మార్పిడి కోసం భారతదేశం యోచిస్తోంది. ఇరు దేశాలు మ్యాప్‌ల పరస్పర మార్పిడి వల్ల సరిహద్దులు, వాస్తవాధీన రేఖలపై స్పష్టత వస్తుందని, పెట్రోలింగ్ ప్రోటోకాల్స్ సులభమవుతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మ్యాప్‌ల మార్పిడికి మాత్రం చైనా అంగీకరించడంలేదు. సరిహద్దు అంశంపై ఇప్పటి వరకూ 22సార్లు చర్చలు జరిగినా ఎల్ఏసీ లేదా మ్యాప్‌ల మార్పిడిపై చైనా ఆసక్తి చూపలేదు.



సరిహద్దు వివాదం పరిష్కారం చాలా దూరంలో ఉన్నప్పటికీ, గల్వాన్ ఘర్షణ తగిన కారణమని భారత్ భావిస్తోంది. మ్యాప్‌ల మార్పిడికి చైనా విముఖత చూపడం వల్ల వివాదాన్ని కొనసాగించడానికే డ్రాగన్ సిద్ధంగా ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో రెండు నెలలుగా ఇరు దేశాలూ భారీగా మోహరించిన తమ సైన్యాలను ప్రస్తుతం వెనక్కు మళ్లిస్తున్నాయని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని, తర్వాత కొన్ని కీలక ప్రాంతాల నుంచి దళాలు, ఆయుధాల వెనక్కి తరలింపు ప్రారంభమవుతుంది భావిస్తున్నారు. వెనక్కు తగ్గడమంటే వారి భూభాగంగా అంగీకరించినట్లు కాదని చర్చలలో పాల్గొన్న ఒక అధికారి చెప్పారు.

ఇదిలా ఉండగా.. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యుఎస్‌ఐఐడి) సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (సీటీఏ)కు మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం ప్రకటించింది. ‘టిబెట్ ప్రజలను ఆర్థికంగా, సాంస్కృతికంగా బలోపేతం చేయడానికి, వారి స్వయం సమృద్ధికి మిలియన్ డాలర్లు ఇస్తున్నట్టు తెలిపింది. బహిష్కరణలో ఉన్న టిబెటన్ ప్రభుత్వం అభివృద్ధికి యుఎస్ నుంచి (భారతదేశం ఆమోదంతో) ప్రత్యక్ష నిధులు పొందడం ఇదే తొలిసారి. భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న వేళ.. అమెరికా ఈ నిధులు విడుదల చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.





Untitled Document
Advertisements