20 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై వెస్టిండీస్ గెలుపు

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 12:56 PM

20 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై వెస్టిండీస్ గెలుపు

ఇంగ్లాండ్‌కి దాని సొంతగడ్డపైనే వెస్టిండీస్‌ ఊహించని షాకిచ్చింది. సౌథాంప్టన్‌లో ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు.. బ్లాక్‌వుడ్ (95: 154 బంతుల్లో 12x4) శతక సమాన ఇన్నింగ్స్ ఆడటంతో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించేసింది. ఛేదన ఆరంభంలోనే ఓపెనర్లు క్రైగ్ బ్రాత్‌వైట్ (4), క్యాంప్‌బెల్ (8 నాటౌట్: తొలి ఓవర్లలోనే రిటైర్డ్ హర్ట్.. ఆఖర్లో మళ్లీ బ్యాటింగ్‌కి వచ్చాడు)తో పాటు షై హోప్ (9), బ్రూక్స్ (0) వరుసగా నిరాశపరిచినా.. రోస్టన్ ఛేజ్‌ (37: 88 బంతుల్లో 1x4), డార్విచ్ (20: 37 బంతుల్లో 1x4)తో కలిసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన బ్లాక్‌వుడ్ కరీబియన్లకి 6 వికెట్ల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 2000 తర్వాత ఇంగ్లాండ్‌ గడ్డపై వెస్టిండీస్ జట్టు ఓ టెస్టు మ్యాచ్‌లో గెలుపొందడం ఇది రెండోసారి మాత్రమే. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో.. గురువారం నుంచి మాంచెస్టర్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గాబ్రిల్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బుధవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లాండ్.. మొదటి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు 318 పరుగులు చేయగా.. ఆ జట్టుకి 114 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

114 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్.. అనూహ్యంగా పోరాడింది. ఓపెనర్ సిబ్లీతో కలిసి రాయ్ బర్న్స్ (42: 104 బంతుల్లో 5x4) తొలి వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. మిడిలార్డర్‌లో జాక్ క్రాలీతో కలిసి కెప్టెన్ బెన్‌స్టోక్స్ (46: 79 బంతుల్లో 6x4) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో.. 111.2 ఓవర్లలో ఇంగ్లాండ్ 313 పరుగులకి ఆలౌటవగా.. వెస్టిండీస్ ముందు సరిగ్గా 200 పరుగుల లక్ష్యం నిలిచింది.

కరోనా వైరస్ నేపథ్యంలో.. దాదాపు మూడు నెలల తర్వాత జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. పూర్తి బయో-సెక్యూర్ వాతావరణంలో ఈ మ్యాచ్‌ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహించింది. ఆటకి ముందు క్రికెటర్లందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. నెగటివ్ అని తేలితేనే ఆటలోకి అనుమతించారు.






Untitled Document
Advertisements