పాకిస్థాన్ ఉగ్రవాదులకు కీలక రహస్యాలు చేరవేసిన జమ్మూ కశ్మీర్ డీఎస్పీ

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 01:07 PM

పాకిస్థాన్ ఉగ్రవాదులకు కీలక రహస్యాలు చేరవేసిన జమ్మూ కశ్మీర్ డీఎస్పీ

ఈ ఏడాది జనవరిలో ఉగ్రవాదులతో కలిసి ఓ కారులో ప్రయాణిస్తూ పట్టుబడ్డ జమ్మూ కశ్మీర్‌కు చెందిన దేవేందర్ సింగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జ్‌షీట్ దాఖలు చేసింది. పాకిస్థాన్‌ హైకమిషన్‌కు దేవేందర్ సింగ్ అత్యంత సున్నితమైన, రహస్య సమాచారం చేరవేసినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవేందర్.. ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్‌ జైల్లో ఉన్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ అధికారులు.. అతడి సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను ఛేదించారు.

ఈ ఖాతాల ద్వారా పాకిస్థాన్‌ హైకమిషన్‌ సిబ్బందితో తరుచూ సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పొందడానికే పాక్‌ అధికారులు అతడిని ఉచ్చులోకి లాగారని అభియోగపత్రంలో వెల్లడించారు. పాకిస్థాన్‌ హైకమిషన్‌లో పనిచేసే షాకత్‌తో దేవేందర్‌ సన్నిహితంగా ఉండేవాడని, అతనికే సున్నిత సమాచారాన్ని చేరవేశాడని అధికారులు తెలిపారు. అయితే, పాక్‌కు ఎటువంటి సమాచారం అందజేశాడన్న వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.

దేవేందర్‌ కంటే ముందు మరో ఐదుగురిపై జులై 6న చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా హిజ్బుల్ ముజాయిద్దీన్ సహకారంతో భారత్‌‌లో దాడులకు పాల్పడినట్టు పేర్కొంది. దేవేందర్ సింగ్ అరెస్ట్ కావడానికి ముందు శ్రీనగర్ విమానాశ్రయంలో యాంటీ-హైజాక్ విభాగం అధిపతిగా ఉన్నారు. జనవరి 11న అతడు ఉగ్రవాదులతో పట్టుబడటంతో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు ఆ బాధ్యతను కేంద్రం అప్పగించింది.

ప్రస్తుతం దేవేందర్ సింగ్‌తోపాటు హిజ్బుల్ ముజాయిద్దీ సంస్థ ఉగ్రవాదులు సయ్యద్ నవీద్ ముస్తాఖ్ అలియాస్ నవీద్ బాబు, అతడి సోదరుడు సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్, ఇర్ఫాన్ షఫీ మిర్, రఫీ అహ్మద్ రథేర్, నియంత్రణ రేఖ వర్తకుల సమాఖ్య మాజీ అధ్యక్షుడు తన్వీర్ అహ్మద్ వనీపై ఛార్జ్ షీట్ దాఖలయ్యింది.

ఢిల్లీలో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే ఢిల్లీలో పాక్ హైకమిషన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులను భారత్ బహష్కరించింది. దాంతోపాటు హైకమిషన్‌ సిబ్బందిని 50 శాతం మేర తగ్గించుకోవాలని పాక్‌ను కోరింది. ఈ మేరకు వారంతా గత నెల్లో పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు.





Untitled Document
Advertisements