29 నుండి ప్రజల అందుబాటులోకి మెట్రో రైలు : కేటీఆర్

     Written by : smtv Desk | Sat, Nov 25, 2017, 04:30 PM

29 నుండి ప్రజల అందుబాటులోకి మెట్రో రైలు : కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 25: నగర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో కల సాకారమైందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 28న ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెట్రో ప్రారంభం అవుతుందన్న కేటీఆర్.. 29 నుంచే సాధారణ ప్రజలకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. మెట్రో రైలులో ప్రయాణించిన అనంతరం నాగోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దేశ చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో.. నాగోలు నుంచి మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల దూరంతో మెట్రోను ప్రారంభించుకోవడం ఇదే ప్రథమం అని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద మెట్రోగా మన౦ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. 28న మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మెట్రోను లాంఛనంగా ప్రారంభిస్తారని స్పష్టం చేశారు.

29న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇలా నాలుగు నెలల పాటు మెట్రో నడుస్తుందన్నారు. ఆ తర్వాత ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా 'టీ సవారీ' స్మార్ట్ కార్డు, నా మెట్రో స్వచ్ఛ మెట్రో పోస్టర్ ను కేటీఆర్ ఆవిష్కరించారు.

ప్రస్తుతం 57 మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రైలులో మూడు కోచ్‌లు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ మూడు కోచ్‌లో ఏకకాలంలో వెయ్యి మంది ప్రయాణించొచ్చు అని చెప్పారు. భవిష్యత్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో మూడు కోచ్‌లతో కలిపి ఆరు కోచ్‌లను అందుబాటులోకి తెస్తామన్నారు. అప్పుడు 2 వేల మంది ప్రయాణించే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా, ఆమోదయోగ్యంగానే మెట్రో టికెట్ ధరలు ఉంటాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రో టికెట్ ధరను ఇవాళ సాయంత్రం వరకు లేదా రేపు ఎల్ అండ్ టీ ప్రకటిస్తుందని తెలిపారు. టికెట్ ధరపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.





Untitled Document
Advertisements