సుశాంత్ ఆత్మహత్య : తొలిసారి స్పందించిన ప్రేయసి రియా చక్రవర్తి

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 11:16 AM

సుశాంత్ ఆత్మహత్య : తొలిసారి స్పందించిన ప్రేయసి రియా చక్రవర్తి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని నెలన్నర దాటినప్పటికీ బాలీవుడ్‌‌లో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. సుశాంత్ సూసైడ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. బిహార్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసు ఫైల్ చేసింది. సుశాంత్ ఖాతా నుంచి అతడి ప్రేయసి రియా చక్రవర్తితోపాటు మరికొందరి బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో నగదు బదిలీ అయ్యిందని ఆయన తండ్రి ఆరోపించారు. తన కొడుకును మోసం చేసిందంటూ.. రియా, ఆమె కుటుంబ సభ్యులతోపాటు మరో ఆరుగురిపై బిహార్లో కేసు నమోదు చేశారు.

సుశాంత్ కుటుంబ సభ్యులు పలు సెక్షన్ల కింద తనపై బిహార్‌లో పెట్టిన కేసులను ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై సుశాంత్ కుటుంబం తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ రియా చక్రవర్తి స్పందించారు. వీడియో స్టేట్‌మెంట్ ద్వారా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.

‘‘నాకు దేవుడి పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల అపారమైన నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా. ఎలక్ట్రానిక్ మీడియాలో నా గురించి భయంకరమైన అంశాలను ప్రసారం చేశారు. కానీ న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండటం వల్ల.. లాయర్ల సలహాతో నేనే మాట్లాడదల్చుకోలేదు. సత్యమేవ జయతే’’ అని రియా చక్రవర్తి మాట్లాడారు.

బిహార్ నుంచి కేసులను ముంబైకి మార్చాలని సుప్రీం కోర్టులో రియా దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆగష్టు 5న విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.

ఎం.ఎస్. ధోనీ ఆటోబయోగ్రఫీ చిత్రంలో నటించిన సుశాంత్.. ధోనీ హావభావాలను అచ్చుగుద్దినట్లుగా దింపేశాడు. క్రికెట్ అభిమానులను సైతం తన ఫ్యాన్స్‌గా మార్చుకున్న సుశాంత్ అనూహ్య రీతిలో జూన్ 14న ముంబైలోని బాంద్రాలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


Untitled Document
Advertisements