కోహ్లీ, తమన్నాలపై హైకోర్టులో పిటిషన్...అరెస్ట్ చేయాలంటూ డిమాండ్

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 01:12 PM

కోహ్లీ, తమన్నాలపై హైకోర్టులో పిటిషన్...అరెస్ట్ చేయాలంటూ డిమాండ్

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ హీరోయిన్ తమన్నాలు వెంటనే అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం సంచలనంగా మారింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ (జూదం)ను ప్రోత్సహించే ప్రకటనల్లో నటిస్తున్నందుకు గాను వీరిపై పిటిషన్ వేశాడు చెన్నైకి చెందిన ఓ న్యాయవాది. మోసపూరితమైన ఆన్‌లైన్ గేమ్‌లకు ప్రచారం చేస్తూ యువతను వీరు పెడదోవ పట్టిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ గేమ్ అనేది యువతలో ఓ వ్యసనంగా మారుతోందని, ఆన్‌లైన్ గేముల నిర్వాహకులు భారీగా నగదు, బోనస్‌లు ప్రకటిస్తుండడంతో యువత దీనికి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే ఆ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ అన్నింటినీ నిషేధించాలని సదరు న్యాయవాది కోరారు. అంతేకాదు బాధ్యతారహితంగా వాటిని ప్రమోట్ చేస్తున్న కోహ్లి,తమన్నాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల ఓ యువకుడు ఆన్‌లైన్ గేముల కోసం అప్పులు చేసి.. తిరిగి చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడులో ఈ తరహా ఆత్మహత్యలు చాలా ఎక్కువైపోయాయని తెలిపారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు దీనిపై వచ్చే మంగళవారం విచారణ జరపనున్నట్లు తెలిసింది. కాగా తమపై దాఖలైన ఈ పిటిషన్‌పై కోహ్లి, తమన్నాలు ఇంకా స్పందించలేదు.





Untitled Document
Advertisements