సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ కన్నుమూత

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 07:11 PM

సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ కన్నుమూత

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ (64) కన్నుమూశారు. సింగపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. గతంలో మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న అమర్‌సింగ్‌.. గత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడున్నారు. ఈ క్రమంలో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన కుటుంబం కూడా ఐసీయూ పక్కనే ఓ గది తీసుకొని ఉంటున్నట్లు సమాచారం.

2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అణు ఒప్పందం విషయంలో వామపక్షాలు తమ మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో అమర్‌ సింగ్‌ కీలకంగా వ్యవహరించారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 2010లో అమర్‌సింగ్‌, ప్రముఖ సినీ నటి జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. జయప్రదకు అత్యంత సన్నిహితుడిగా, రాజకీయ గురువుగా అమర్ సింగ్‌కు పేరుంది.
జయప్రద, అమర్ సింగ్

అమర్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయన ట్విటర్‌ను పరిశీలిస్తే.. సమకాలీన అంశాలపై ఎంతో చురుగ్గా ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం కూడా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్‌ తిలక్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ చేసిన రెండు గంటలకే అమర్ సింగ్ కన్నుమూశారు.


Untitled Document
Advertisements