అయోధ్య రామ మందిరానికి 2.1 టన్నుల భారీ గంట

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 09:37 AM

అయోధ్య రామ మందిరానికి 2.1 టన్నుల భారీ గంట

అయోధ్యలోని రామమందిరంలో ఏర్పాటుచేసేందుకు 2.1 టన్నుల బరువున్న భారీ గంట రూపుదిద్దుకుంటోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలేసర్‌లో దావూ దయాల్‌ అనే హిందూ కుటుంబం దీన్ని సిద్ధం చేస్తోంది. గత నాలుగు తరాలుగా ఈ కుటుంబం వివిధ ఆకృతుల్లో ఇత్తడి వస్తువులను తయారు చేస్తోంది. వీరి వద్ద అత్యంత నైపుణ్యవంతులైన ముస్లిం కార్మికులు పనిచేస్తున్నారు. ఇంత భారీ గంటను తాము తయారు చేయడం ఇదే మొదలని దయాల్‌ పేర్కొన్నారు.


గంట తయారీలో అష్ట ధాతువులైన పసిడి, వెండి, రాగి, జింక్‌, సీసం, టిన్‌, ఇనుము, పాదరసం వినియోగిస్తున్నారు. ‘గంటలో ఎలాంటి అతుకులు ఉండవు. అదే ప్రత్యేకత. తయారీకి రూ.21 లక్షలు ఖర్చవుతుంది. 25 మంది నిపుణులు నాలుగు నెలలపాటు శ్రమించాలి. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌ ఆలయంలో ప్రతిష్ఠించేందుకు మేము వెయ్యి కిలోల బరువున్న గంటను తయారు చేసి అందించాం’ అని దయాల్‌ చెప్పారు.
ఇక, గంట ఆకృతిని ముస్లిం కార్మికుడు ఇక్బాల్ మిస్త్రీ రూపొందించడం మరో విశేషం. డిజైన్ల రూపకల్పనలో ఇక్బాల్ సిద్ధహస్తుడని దయాల్ తెలిపారు. ఈ పరిమాణంలో వస్తువును తయారుచేసేటప్పుడు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని దయాల్ అన్నారు.
‘నెలల తరబడి జరిగే ప్రక్రియలో ఒక్క తప్పు కూడా చేయకుండా చూసుకోవడం చాలా కష్టం. రామాలయం కోసం మేము దీనిని తయారుచేస్తున్నాం అనేది మాకు ఉత్సాహాన్నిచ్చింది, కాని వైఫల్యం భయం కూడా మన మనస్సులో వెంటాడుతోంది’ అని ఆయన చెప్పారు. ఇందులో విజయం సాధిస్తామని ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు.
దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది పై నుంచి కిందకు కేవలం ఒక ముక్క మాత్రమే.. దీనికి అతుకులు ఉండవు.. ఇదే పనిని మరింత కష్టతరం చేసిందని ఇక్బాల్ మిస్త్రీ వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత భారీ గంటను రామాలయానికి కానుకగా ఇవ్వబోతున్నామని జలేసర్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ వికాస్ మిట్టల్ తెలిపారు.
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణమే భారీ గంటను సిద్ధం చేయాలని నిర్మోహీ అఖాడా కోరిందని అన్నారు. ఇది మేము దైవ నిర్ణయంగా భావిస్తున్నాం.. అందుకే ఈ గంటను తామే ఎందుకు విరాళంగా ఇవ్వరాదని భావించామని వికాస్ సోదరుడు ఆదిత్య మిట్టల్ అన్నారు.





Untitled Document
Advertisements