ఇడుక్కి జిల్లాలో ప్రమాదం: @43కి చేరిన మృతుల సంఖ్య

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 09:39 AM

ఇడుక్కి జిల్లాలో ప్రమాదం: @43కి చేరిన మృతుల సంఖ్య

మూడు రోజుల కిందట కేరళలోని ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆదివారం సాయంత్రం వరకు మరో 17 మంది మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 43కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 12 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. మరో 30 మంది ఆచూకీ గల్లంతయినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం భారీ వర్షాలు కురవడంతో రాజమలాయ్‌ ప్రాంతంలోని 30 నివాసాలున్న తేయాకు తోటల కార్మికుల కాలనీలో కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో ఇప్పటికే 26 మంది మృతదేహాలు బయటపడగా, ఆదివారం మరో 17 శవాలు వెలికి తీశారు. మిగతావారి కోసం స్నైపర్‌ శునకాలతో గాలిస్తున్నారు. మంత్రి వి.మురళీధరన్‌, ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితల ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించారు. సోమవారం మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ కేరళలోని పలు జిల్లాలను హెచ్చరించింది. అలప్పళ, ఇడుక్కి, మలప్పురం, కోలికోడ్‌, వయనాడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ ప్రాంతాల్లో రెడ్‌ అలెర్ట్‌ విధించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌‌కు చెందిన ఆరు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షల పరిహారం అందజేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి సైతం రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో 82 మందితో కూడిన నాలుగు కార్మిక క్యాంప్‌లు ఉన్నాయి. దుర్ఘటన జరిగే సమయానికి చాలా మంది అక్కడ ఉన్నారనేది ఖచ్చితంగా తెలియదు.





Untitled Document
Advertisements