ALERT: కరోనా అనుమానితులు ఈ విషయంలో జాగ్రత్త!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 09:43 AM

ALERT: కరోనా అనుమానితులు ఈ విషయంలో  జాగ్రత్త!

కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ విధానాన్ని నమ్ముకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే.. వారిని గుర్తించి టెస్టులు చేసి చికిత్స అందించడం అన్నమాట. ఈ విధానం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చనేది డబ్ల్యూహెచ్‌వో సహా నిపుణుల మాట. కానీ టెస్టుల విషయంలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు, ఆర్టీపీసీఆర్.. ఇలా రకరకాల టెస్టుల అందుబాటులోకి వచ్చాయి.


మొదట తెలంగాణలో ఆర్టీపీసీఆర్ టెస్టులనే చేసేవారు. కానీ ఫలితం తేలడానికి 2-3 రోజుల సమయం పడుతుండటంతో అర గంటలోనే ఫలితం వచ్చే ర్యాపిడ్ టెస్టులను చేస్తున్నారు. వీటి వల్ల ఫలితం త్వరగా తేలుతున్నప్పటికీ.. కచ్చితత్వం మాత్రం తగ్గుతోంది. కరోనా సోకిందని తెలిసిన వెంటనే చాలా మంది సమీపంలోని పీహెచ్‌సీ లేదా హాస్పిటల్‌కు వెళ్తే.. యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. వీరిలో కొందరికి పాజిటివ్ అని వస్తుండగా.. మరి కొందరికి కరోనా ఉన్నప్పటికీ నెగటివ్ అని రిపోర్ట్ వస్తోంది.
కొద్ది రోజులకు లక్షణాలు తీవ్రం కావడంతో వారు మళ్లీ హాస్పిటళ్లకు వెళ్తే.. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ల్యాబ్‌లకు వెళ్లి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుంటే ఫలితం పాజిటివ్ అని వస్తోంది.
యాంటీజెన్ టెస్టులో కరోనా పాజిటివ్ అని వస్తే.. ఒంట్లో కచ్చితంగా వైరస్ ఉన్నట్లే. కానీ నెగటివ్ అని వస్తే మాత్రం అనుమానించాల్సిందే. ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ అని వచ్చిన వారు.. ఆర్టీపీసీఆర్‌ ద్వారా పాజిటివ్ అని నిర్ధారించుకోవడానికి సమయం పడుతోంది. దీంతో ఊపిరితిత్తులకు సిటీ స్కాన్ చేసి కరోనా ఇన్ఫెక్షన్‌ను గుర్తించాల్సి వస్తోంది. ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందో కూడా దీని ద్వారా గుర్తించగల్గుతున్నారు.
కరోనా లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె పట్టేసినట్లు ఉండటం, ఆయాసం లాంటి లక్షణాలు ఉంటే.. ర్యాపిడ్ టెస్టు చేయించుకొని నెగటివ్ వస్తే.. నిర్లక్ష్యంగా ఉండొద్దని.. ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ అని వస్తే.. తమకు కరోనా లేదనే భావనతో ఇతరులతో సన్నిహితంగా మెలగడం వల్ల వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది.





Untitled Document
Advertisements