శుభవార్త : ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్ విడుదల!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 01:06 PM

శుభవార్త : ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్ విడుదల!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత మరింత పెరిగిపోతుండగా.. వ్యాక్సిన్ విషయంలో రష్యా కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌కు తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న ప్రపంచానికి పరిచయం చేయనున్నామని రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అయితే, ఈ ప్రకటనపై అమెరికా భిన్నంగా స్పందించింది. వ్యాక్సిన్‌ను అన్ని రకాలుగా పరీక్షించి, ఫలితాలను నిర్దారించుకున్న తరువాతనే రష్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నామని యూఎస్ అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ సిద్ధమైనట్టు ప్రకటించిన రష్యా, దాన్ని పంపిణీ చేసే ముందు ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

కాగా, ఈ వ్యాక్సిన్‌కు గమలేయా రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. గత వారం రక్షణ శాఖ ప్రతినిధి గ్రిడ్నేవ్ మీడియాతో మాట్లాడుతూ.. తొలి దశలో మెడికల్ సిబ్బంది, వయో వృద్ధులకు వ్యాక్సిన్ అందజేయనున్నామని తెలిపారు. వ్యాక్సిన్ భద్రతను, సమర్ధతను 1,600 మందిపై పరిశీలించామని కూడా అన్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్ సమయాన్ని కుదించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత ఏప్రిల్‌లోనే అధికారులను ఆదేశించగా, వైద్య నిపుణులు మూడు దశల పరీక్షలను శరవేగంగా పూర్తి చేశారు.


రోగనిరోధక శక్తి బలోపేతం అయిన తరువాత టీకా ప్రభావం వెల్లడవుతుందని మంత్రి తెలిపారు. రష్యా గమలేయా నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌‌లో పాల్గొన్న వాలంటీర్లలో వ్యాధినిరోధక శక్తిని చూపించిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.



‘గమలేయా సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న రిజిస్టర్‌ చేస్తాం. ప్రస్తుతం చివరి, మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ ఎంత భద్రమన్నది నిర్ణయించేందుకు ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. మొదట వైద్య నిపుణులు, వృద్ధులకు టీకా ఇవ్వనున్నాం’ అని ఆరోగ్యశాఖ సహాయమంత్రి ఒలెగ్‌ గ్రిడ్‌నేవ్‌ వ్యాఖ్యానించారు.

జూన్ 17న 76 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. వీరిలో సగం మందికి ఇంజక్షన్ రూపంలో, మిగతావారికి పౌడర్ రూపంలో వ్యాక్సిన్ ఇచ్చామని అధికారులు తెలిపారు. రెండు రకాల పరీక్షల్లోనూ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చిందని, అందరిలోనూ వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని 'స్పుత్నిక్' న్యూస్ వెల్లడించింది. ఎవరిలోనూ దుష్ప్రభావం చూపలేదని వెల్లడించింది.


ఈ వ్యాక్సిన్‌ను భారీ ఎత్తున ఉత్పత్తి చేసే పనులను సెప్టెంబరులో ప్రారంభించనున్నామని రష్యా పరిశ్రమల శాఖ మంత్రి డెనిస్ మన్తురోవ్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు రష్యాలో మొత్తం 8,82,347 మంది వైరస్ బారినపడగా.. 14,854 మంది ప్రాణాలు కోల్పోయారు.





Untitled Document
Advertisements