'మర్డర్' నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసిన వర్మ...కన్ఫ్యూజన్ స్టార్ట్!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 02:03 PM

'మర్డర్' నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసిన వర్మ...కన్ఫ్యూజన్ స్టార్ట్!

ఇటీవలే ‘పవర్ స్టార్’ సినిమాతో పరేశాన్ చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' అంటూ మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతి క్షణం అందరి చూపు తన మీదనే ఉండేలా ప్లాన్ చేస్తున్న ఆయన.. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత, ప్రణయ్ కథ ఆధారంగా సినిమా ప్రకటించారు. పైగా ఈ సినిమాలో ప్రణయ్ హత్యోదంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపించనున్నట్లు పలు పోస్టర్స్ రిలీజ్ చేయడంతో ఈ ఇష్యూ పోలీస్, కోర్టు కేసుల వరకూ వెళ్లింది.

ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ 'మర్డర్' మూవీకి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్ లైన్ పెట్టి సినిమాపై జనాల్లో ఆసక్తి రేకెత్తించారు వర్మ. తనదైన స్టైల్ ప్రమోషన్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అమృత తండ్రి మారుతీరావు ఆవేదన తెలుపుతూ ''పిల్లల్ని ప్రేమించడం తప్పా...?'' అనే పాట విడుదల చేసి చర్చల్లో నిలిచిన ఆయన.. తాజాగా ‘‘నచ్చినోన్ని పేమించడం తప్పా?’’ అనే సాంగ్ రిలీజ్ చేస్తూ అమృత సైడ్ యాంగిల్ చెప్పేశారు. దీంతో వర్మ వేసిన ఈ రివర్స్ గేర్ జనాల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.


ఇక ఇప్పటికే ప్రణయ్ కుటుంబ సభ్యులు, అమృత ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా పేర్లు, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా తీసి తమ జీవితాలపై ప్రభావం చూపుతున్నారని వారు పేర్కొన్నారు. దీంతో ఈ మర్డర్ సినిమాలో వర్మ ఏం చూపిస్తారు? అసలు వర్మ టార్గెట్ ఏంటి? అనే కోణంలో చర్చలు ముదిరాయి. వర్మ సమర్పణలో ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ఏకంగా 5 భాషలు (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం)లో ఈ మూవీ విడుదల కానుండటం విశేషం.


Untitled Document
Advertisements