ఎంపీ కనిమొళికి సంఘటన పై చిదంబరం కామెంట్స్...!!!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 04:05 PM

ఎంపీ కనిమొళికి సంఘటన పై చిదంబరం కామెంట్స్...!!!

డీఎంకే ఎంపీ కనిమొళికి చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురయిన విషయం తెలిసిందే. హిందీకి బదులు ఇంగ్లీష్ గానీ, తమిళం గానీ మాట్లాడమని అడిగినందుకు ఓ అధికారిణి.. కనిమొళిని ‘మీరు భారతీయులేనా’ అని ప్రశ్నించారు. ఇది తనకు ఆశ్చర్యానికి గురిచేసిందని ఎంపీ కనిమొళి ఆదివారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. డీఎంకే ఎంపీ కనిమొళికి ఎదురైన వింత అనుభవం అసాధారణం కాదన్నారు. తాను కూడా గతంలో ఎన్నోసార్లు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని చిదంబరం పేర్కొన్నారు.


‘ప్రభుత్వాధికారులు, సాధారణ పౌరులతో టెలిఫోన్ సంభాషణలు, ముఖాముఖి సమయంలోనూ హిందీలో మాట్లాడాలని ఇలాంటి అవమానాలు ఎదురయ్యాయి’అని అన్నారు. ఉద్యోగులు హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడేలా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చిదంబరం సూచించారు. ‘ఒకవేళ హిందు, ఇంగ్లీష్‌లను భారతీయ అధికార భాషలుగా గుర్తించడానికి కేంద్రం కట్టుబడి ఉంటే.. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి హిందీ, ఇంగ్లీషును తప్పనిసరి చేయాలి’ అని చిదంబరం సలహా ఇచ్చారు.
‘కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చేరిన హిందీయేతరులు త్వరగా హిందీని నేర్చుకుంటున్నారు.. మరి హిందీ మాట్లాడే ఉద్యోగులు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడంలేదు’ అని మరో ట్వీట్ చేశారు. కనిమొళి ట్వీట్‌పై కార్తీ చిదంబరం కూడా స్పందించారు. ‘భాషా పరీక్ష.. తర్వాత ఏంటి?’ అని ప్రశ్నించారు. సీఐఎస్‌ఎఫ్‌ స్పందించాలంటూ ఆయన ట్వీట్‌ చేశారు.
కాగా, కేంద్ర తీసుకొచ్చిన నూతన విద్యా విధానం త్రిభాషా సూత్రాన్ని ప్రోత్సహించేదిగా ఉందని, తాము దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేయబోమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడిప్పాడి పళనిసామి ప్రధానికి స్పష్టం చేశారు. తాజాగా, కనిమొళి అంశంతో ప్రాంతీయ భాషలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.





Untitled Document
Advertisements