మీడియా నన్ను బలిపశువును చేస్తుంది: సుప్రీంలో సుశాంత్ ప్రియురాలు పిటిషన్

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 10:14 PM

మీడియా నన్ను బలిపశువును చేస్తుంది: సుప్రీంలో సుశాంత్ ప్రియురాలు పిటిషన్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మీడియా తనను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తోందని, దీని నుంచి తనను కాపాడాలని కోరుతూ ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి సుప్రీం కోర్టులో మరో పిటిషన్ వేశారు. తన న్యాయవాది ద్వారా సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించిన రియా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి విషయంలో మీడియా పక్షపాత ధోరణి వల్ల తాను దోషిని అయిపోయానని పేర్కొన్నారు.
మీడియా మాత్రమే కాకుండా బిహార్ రాజకీయాలు కూడా తనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయని పిటిషన్ ద్వారా రియా చెప్పకనే చెప్పారు. బిహార్ ఎన్నికలు, పాట్నాలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం వల్ల సుశాంత్ మృతిని ఎక్కువ చేసి చూపిస్తున్నారని అఫిడవిట్‌లో రియా పేర్కొన్నారు. ఈ రాజకీయాలకు తాను బలిపశువును కాకుండా కాపాడాలని అత్యున్నత ధర్మాసనానికి రియా విజ్ఞప్తి చేశారు.
అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు
1. బిహార్‌‌కు చెందిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషాదకర మృతి ఘటన బిహార్ ఎన్నికల సమయంలో చోటుచేసుకోవడం దురదృష్టకరం. నాలుగు గోడల మధ్య చేసుకున్న ఆత్మహత్య ఘటన ఆ తరవాత ఎంతో ప్రధానమైన అంశంగా మారింది. గడిచిన 30 రోజుల్లో నటులు అశుతోష్ భక్రే (32), సమీర్ శర్మ (44) కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కానీ, ఈ ఘటనల గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో బిహార్ ముఖ్యమంత్రి పాట్నాలో ఎఫ్‌ఐఆర్ నమోదు బాధ్యత వహిస్తున్నట్లు సమాచారం.



2. మీడియాలో ఈ అంశానికి బోలెడంత ప్రాముఖ్యత. ఈ కేసులో సాక్షులందరినీ మీడియా ఛానెల్స్ విచారిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి ఘటనలో ఇంకా దర్యాప్తు పూర్తికాక ముందే పిటిషనర్‌ను మీడియా దోషిగా తేల్చేసింది.

3. ఈ కేసును నిరంతరం సంచలనాత్మకం చేయడం వల్ల పిటిషనర్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రైవసీని కోల్పోతున్నారు.

4. 2జీ, తల్వార్ కేసుల్లో మీడియా ఇలానే వ్యవహరించి నిందితులను దోషుల్ని చేసింది. కానీ, ఆ కేసులో నిందితులంతా అమాయకులను కోర్టులు గుర్తించాయి.

5. వేలాది కోట్ల ఆర్థిక కుంభకోణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు బయట ప్రపంచానికి తెలియకుండా జరుగుతుంది. కానీ, ఎలాంటి న్యాయ విచారణ జరగని ప్రారంభదశలో ఉన్న కేసుకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ కేసులు నమోదు చేస్తాయి.

ఇదిలా ఉంటే, రియా ఇప్పటికే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేశారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ తనపై పెట్టిన కేసు విచారణను బిహార్ పోలీసుల నుంచి ముంబై పోలీసులకు బదిలీ చేయాలని కోరుతూ రియా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.





Untitled Document
Advertisements