'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'కు రామ్ చరణ్ ఫిదా

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 10:23 PM

'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'కు రామ్ చరణ్ ఫిదా

సత్యదేవ్ హీరోగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సినీ ప్రముఖులు కూడా చాలా బాగుందంటూ కొనియాడుతున్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఈ ఖాతాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరారు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. నటీనటుల ప్రదర్శనను కొనియాడారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ట్వీట్ చేశారు.

‘‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా నాకు ఎంతగానో నచ్చింది. నిజంగా కథపై ఆధారపడి తీసిన సినిమా. సత్యదేవ్, నరేష్ గారు, సుహాస్, హరి చందన, రూపల మనోరంజకమైన నటన నన్ను కట్టిపడేసింది. నీ టీమ్ నుంచి ది బెస్ట్ రాబట్టగలిగావు వెంకటేష్ మహా. ఇంత గొప్ప విజయం సాధించినందుకు విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఆర్కా మీడియా వర్స్క్ టీమ్‌కి అభినందనలు’’ అని రామ్ చరణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. మంచి వ్యూవర్‌షిప్‌ను సాధిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందంటూ మరొకరికి చెబుతున్నారు. ఓటీటీలో మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ ఈటీవీ కొనుగోలు చేసింది. మంచి ధరకు శాటిలైట్ రైట్స్‌ను ఈటీవీ కొనుగోలు చేసినట్టు సమాచారం.

కాగా, మ‌ల‌యాళ హిట్ మూవీ ‘మ‌హేశింతే ప్రతీకార‌మ్‌’‌ను తెలుగులో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ పేరుతో రీమేక్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని, విజ‌య ప్రవీణ ప‌రుచూరి నిర్మించారు. వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. జాతీయ అవార్డు గ్రహీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్రభాక‌ర్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ సినిమాను అరకు వ్యాలీలో కేవలం 36 రోజుల్లో చిత్రీకరించారు.






Untitled Document
Advertisements