పాక్ స్పిన్నర్‌పై నోరుజారిన ఇంగ్లాండ్ క్రికెటర్...జరిమానా!

     Written by : smtv Desk | Tue, Aug 11, 2020, 10:00 PM

పాక్ స్పిన్నర్‌పై నోరుజారిన ఇంగ్లాండ్ క్రికెటర్...జరిమానా!

మైదానంలో క్రమశిక్షణ తప్పిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కి జరిమానా పడింది. పాకిస్థాన్‌తో మాంచెస్టర్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో.. తన వికెట్ పడగొట్టిన స్పిన్నర్ యాసిర్ షాని ఉద్దేశించి స్టువర్ట్ బ్రాడ్ నోరుజారాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన స్టువర్ట్ బ్రాడ్ (7: 9 బంతుల్లో 1x4) వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. అప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో తనకి బ్రాడ్ సిక్స్ కొట్టి ఉండటంతో.. రెండో ఇన్నింగ్స్‌లో అతడ్ని ఔట్ చేయడం ద్వారా యాసిర్ షా బదులు తీర్చుకున్నట్లయింది.







బ్రాడ్‌ వికెట్ పడగొట్టిన తర్వాత యాసిర్ షా.. గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోగా.. బ్రాడ్ బూతులు తిడుతూ పెవిలియన్‌ వైపు నడిచాడు. దాంతో.. మ్యాచ్ రిఫరీ క్రిస్‌ బ్రాడ్.. మైదానంలో స్టువర్ట్ బ్రాడ్ క్రమశిక్షణ తప్పినట్లు తేల్చి.. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు స్టువర్ట్ బ్రాడ్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ని కూడా జత చేశాడు. దాంతో.. బ్రాడ్ ఖాతాలో డీమెరిట్ పాయింట్ల సంఖ్య మూడుకి చేరింది.

దక్షిణాఫ్రికాతో ఈ ఏడాది టెస్టు మ్యాచ్ ఆడుతూ నోరుజారిన స్టువర్ట్ బ్రాడ్‌కి మ్యాచ్ రిఫరీ ఒక డీమెరిట్ పాయింట్ ఇవ్వగా.. 2018, ఆగస్టు 19న భారత్‌తో మ్యాచ్ ఆడుతూ బ్రాడ్ క్రమశిక్షణ తప్పి ఒక పాయింట్‌ని అందుకున్నాడు. తాజాగా మూడో డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో చేరగా.. రెండేళ్ల వ్యవధిలో ఒక క్రికెటర్ ఖాతాలో మొత్తం నాలుగు డీమెరిట్ పాయింట్లు చేరితే అతనిపై ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధం పడనుంది. పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.





Untitled Document
Advertisements