హిందూ ఆలయానికి రక్షణగా ముస్లిం యువకుల మానవహారం!

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 05:31 PM

హిందూ ఆలయానికి రక్షణగా ముస్లిం యువకుల మానవహారం!

బెంగళూరు నగరం ఓ వైపు అల్లర్లతో అల్లకల్లోలం కాగా.. మరోవైపు మత సామరస్యం కొనసాగుతోంది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కొంత మంది ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటారు. డీజే హాళ్లి ప్రాంతంలోని ఒక హిందూ ఆలయానికి రక్షణగా నిలిచారు. ఆందోళనకారులు దాడి చేయకుండా ఆలయం చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. గంటల తరబడి అలాగే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బెంగళూరులోని డీజే హాళ్లిలో మంగళవారం (ఆగస్టు 11) రాత్రి చెలరేగిన ఘర్షణ హింసకు దారి తీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అల్లర్లతో సంబంధం ఉన్న 110 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి అల్లుడు ఒక వర్గాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపింది. దీంతో ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. మంగళవారం రాత్రి ఆందోళనకారులు ఆ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. అక్కడ ఉన్న వందలాది వాహనాలకు నిప్పుపెట్టారు. ఎమ్మెల్యే నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బందితోనూ నిరసనకారులు అనుచితంగా ప్రవర్తించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏసీపీ సహా 60 మంది పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిపై ముస్లిం సంఘాలు ఫిర్యాదు చేశాయి. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.





Untitled Document
Advertisements