సెప్టెంబర్ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 08:08 PM

సెప్టెంబర్ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు

కరోనా కారణంగా వాయిదా పడిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎగ్జామ్స్ నిర్వహించే తేదీలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాలకు సెప్టెంబర్ 20 నుంచి వారం రోజుల పాటు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ఎగ్జామ్స్‌కు దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని.. రాష్ట్రంలో మూడు నుంచి ఐదు వేల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

తొలిరోజే సుమారు 4.5లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. దాదాపు 3నుంచి 5వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువగా ఖాళీలు ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలను ఆగష్టు రెండో వారంలో నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements