న్యూజిలాండ్‌లో కొత్తగా 4 కరోనా కేసులు!

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 10:37 PM

న్యూజిలాండ్‌లో కొత్తగా 4 కరోనా  కేసులు!

న్యూజిలాండ్‌లో 102 రోజుల త‌ర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండటం అలజడి రేపుతోంది. మంగళవారం (ఆగస్టు 11) ఆ దేశంలో చాలా రోజుల తర్వాత తొలి కేసు నమోదు కాగా.. బుధవారం (ఆగస్టు 12) ఆక్లాండ్ నగరంలో కొత్తగా నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే కటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు న్యూజిలాండ్ ప్రభుత్వం తెలిపింది.

తమ దేశం నుంచి కరోనా వైరస్‌ను పూర్తిగా తరిమికొట్టినట్లు 100 రోజుల కిందట న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. ప్రజలు ఇక పండగ చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఆమె చెప్పినట్లే ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కానీ, తాజాగా మళ్లీ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి విషయంలో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించిన నేపథ్యంలో తాజా కేసులతో ప్రతిష్ట మసకబారుతుందని న్యూజిలాండ్ భావిస్తోంది.

ఆక్లాండ్ నగరంలో లాక్‌డౌన్ విధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ఆదేశించారు. భౌతిక దూరం తదితర కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బార్లు, రెస్టారెంట్లను తక్షణమే మూసేయాలని ఆదేశించారు.

మరోసారి కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో న్యూజిలాండ్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం కరోనా పరీక్షా కేంద్రాల వద్ద జనం వందల సంఖ్యలో బారులు తీరారు. ఆయా కేంద్రాల వద్ద రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరి ఉండటం కనిపించింది.

కొత్తగా నమోదైనవి 4 కేసులే అయినప్పటికీ.. బాధితుల్లో ఇద్దరు 140 మైళ్ల దూరంలోని రోటోరాను సందర్శించి రావడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ కూడా వైరస్ ప్రబలే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే.. వారు ఇతర దేశాలకు మాత్రం వెళ్లలేదని స్పష్టం చేశారు. దేశంలోని ప్రజలందరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆరుబయటకు వస్తే భౌతిక దూరం పాటించాలని, మాస్కుల ధరించాలని హెచ్చరించారు.

అటు పొరుగు దేశం ఆస్ట్రేలియాలో భారీ సంఖ్యలో కేసులు నమోదవడం కూడా న్యూజిలాండ్ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. మెల్‌బోర్న్‌లో చాలా రోజుల తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల వద్ద అధికారులను అప్రమత్తం చేశారు.

కొత్తగా నమోదైన కేసులతో క‌లిపి న్యూజిలాండ్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 26కు చేరింది. సుమారు 5 మిలియన్ల జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటివరకు 1225 కేసులు నమోదు కాగా.. 22 మంది మరణించారు.





Untitled Document
Advertisements