ఇంగ్లాండ్ తో టెస్టు: రెండో టెస్టులో పాక్‌కి ఊహించని షాక్!

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 09:50 AM

ఇంగ్లాండ్ తో టెస్టు: రెండో టెస్టులో పాక్‌కి ఊహించని షాక్!

ఇంగ్లాండ్ గడ్డపై తొలి టెస్టులో ఓడిన పాకిస్థాన్ జట్టు.. రెండో టెస్టునీ పేలవంగా ఆరంభించింది. సౌథాంప్టన్ వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. వర్షం కారణంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 126/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో బాబర్ అజామ్ (25 బ్యాటింగ్: 51 బంతుల్లో 1x4), మహ్మద్ రిజ్వాన్ (4 బ్యాటింగ్: 5 బంతుల్లో) ఉండగా.. తొలి రోజు వర్షం కారణంగా కేవలం 45.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ అజహర్ అలీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ.. తొలి టెస్టులో సెంచరీ బాదిన పాక్ ఓపెనర్ షాన్ మసూద్ (1) మూడో ఓవర్‌లోనే పెవిలియన్‌కి చేరిపోగా.. మరో ఓపెనర్ అబిద్ అలీ (60: 111 బంతుల్లో 7x4) మాత్రం అర్ధశతకంతో ఫర్వాలేదనిపించాడు. అయితే.. కెప్టెన్ అజహర్ అలీ (20: 85 బంతుల్లో 1x4), అసద్ షాఫిక్ (5: 13 బంతుల్లో 1x4), పవాద్ అలామ్ (0: 4 బంతుల్లో) వరుస విరామాల్లో ఔటవడంతో పాకిస్థాన్ ఒత్తిడిలో పడింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్టువర్ట్ బ్రాడ్, శామ్ కరన్, క్రిస్ వోక్స్ తలో వికెట్ తీశారు.

ఇంగ్లాండ్ గడ్డపై మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ని పాకిస్థాన్ ఆడనుండగా.. తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాంతో.. సిరీస్‌పై ఆశలు నిలవాలంటే ఈ సౌథాంప్టన్ టెస్టులో పాకిస్థాన్ తప్పక గెలవాల్సి ఉంది.



Untitled Document
Advertisements