చికెన్ వింగ్స్‌లో కరోనా వైరస్...డబ్ల్యూహెచ్‌వో ప్రకటన

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 12:58 PM

చికెన్ వింగ్స్‌లో కరోనా వైరస్...డబ్ల్యూహెచ్‌వో ప్రకటన

బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న చికెన్ వింగ్స్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు చైనా చేసిన ప్రకటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఆహారం ద్వారా లేదా ప్యాకేజింగ్ ద్వారా కోవిడ్ సోకుతుందనడానికి ఆధారల్లేవని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఆహార గొలుసు ద్వారా కరోనా వ్యాప్తి చెందుంతుందని భయపడొద్దని ప్రజలకు సూచించింది. ‘‘ఆహారం విషయంలో ప్రజలు భయపడొద్దు. ఆహారం ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ లేదా డెలివరీ గురించి జనం ఆందోళన చెందొద్దు’’ అని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీస్ ప్రొగ్రాం హెడ్ మైక్ ర్యాన్ తెలిపారు.

చైనా లక్షలాది ఫుడ్ ప్యాకేజీలను టెస్టు చేయగా కేవలం పది లోపు ప్యాకేజీల్లోనే వైరస్ ఆనవాళ్లను గుర్తించారని డబ్ల్యూహెచ్‌వో ఎపిడమియోలజిస్ట్ మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు.

బ్రెజిల్, ఈక్వెడార్ తదితర దేశాల నుంచి చైనాకు భారీ ఎత్తున మాంసం ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్‌లో చికెన్ వింగ్స్‌లో కరోనా ఆనవాళ్లను గుర్తించామని చైనా ప్రకటించింది. ఈక్వెడార్ నుంచి వచ్చిన రొయ్యల్లోనూ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని తెలిపింది. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

ఈ విషయమై బ్రెజిల్ స్పందించింది. చైనా కనుగొన్న కరోనా ఆనవాళ్ల గురించి వివరణ కోరుతున్నామని బ్రెజిల్ వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈక్వెడార్ ప్రొడక్షన్ మినిస్టర్ మాట్లాడుతూ.. తమ దేశంలో కఠినమైన నియమాలను పాటిస్తున్నామన్నారు. తమ దేశం దాటి వెళ్లిన తర్వాత వస్తువులకు ఏమవుతుందనేది తమ బాధ్యత కాదన్నారు.





Untitled Document
Advertisements