అసెంబ్లీలో సచిన్ పైలట్ ఆసక్తికర వ్యాఖ్యలు...!!

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 04:17 PM

అసెంబ్లీలో సచిన్ పైలట్ ఆసక్తికర వ్యాఖ్యలు...!!

రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం టీ కప్పులో తుఫాను మాదిరిగా వెలసిపోయింది. రెబల్ నేత సచిన్ పైలట్ తిరిగి సొంతగూటికి చేరడంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కాగా.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని ప్రతిపక్ష బీజేపీకి ఇవ్వకుండా గెహ్లాట్ ఎత్తు వేశారు. ప్రభుత్వమే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం విశేషం. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరీవాల్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డబ్బు, అధికారంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చడానికి కేంద్రం ప్రయత్నించిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్, గోవా, మణిపుర్ మాదిరిగా రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు. సామ్రాజ్య విస్తరణలో భాగంగా మేవార్‌ను ఆక్రమించుకోవాలని చూసిన మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు ఓటమి దెబ్బను రుచిచూపించిన ఘన చరిత్ర రాజస్థాన్ సొంతమని, ప్రస్తుతం బీజేపీ ప్రయత్నాలను కూడా గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ అదే విధంగా అడ్డుకుందని అన్నారు.

అవిశ్వాస తీర్మానంపై సచిన్ పైలట్ మాట్లాడుతూ.. సరిహద్దులకు బలమైన, ఉత్తమ సైనికులను పంపామని విశ్వసిస్తున్నామన్నారు. డాక్టర్ జోక్యంతో మనందరం ఐక్యంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. మా సమస్య గురించి వైద్యుడి ముందు లేవనెత్తాం... ఆయన చికిత్స పొందిన తరువాత ఇక్కడ ఐక్యతతో నిలిచామని అధిష్ఠానం జోక్యాన్ని పరోక్షంగా పైలట్ ప్రస్తావించారు.

సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వాస తీర్మానంపై వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సచిన్ పైలట్‌తో గురువారం సమావేశమైన తరువాత, ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం విశ్వాస తీర్మానాన్ని సీఎం కాకుండా మిగతా సభ్యుడెవరైనా ప్రతిపాదించాల్సి వుండటంతో శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టారు. తద్వారా 200 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో తమ ప్రభుత్వానికి సాధారణం కన్నా ఎక్కువ మెజార్టీ ఉందని నిరూపించడమే గెహ్లాట్ ఉద్దేశం.

విశ్వాస తీర్మానం నెగ్గితో మరో ఆరు నెలల పాటు గెహ్లాట్ సర్కారును పడగొట్టడానికి అవకాశం ఉండదు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం.. గెహ్లాట్ ప్రభుత్వానికి 125 మంది ఎమ్మెల్యేల మద్దతుంది.





Untitled Document
Advertisements