39 మంది చిన్నారులకు ర‌క్షణగా సోనూసూద్

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 04:54 PM

39 మంది చిన్నారులకు ర‌క్షణగా సోనూసూద్

వెండితెర విలన్ సోనూసూద్.. కరోనా కష్టకాలంలో రియల్ హీరోగా మారారు. ఎంతో మందికి సేవ చేస్తూ వస్తున్నారు. క‌ష్టం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారు. తాజాగా సోనూసూద్ చేసిన మరో మంచి పనికి సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న 39 మంది చిన్నారులకు చికిత్స కోసం ఫిలిప్పీన్స్‌ నుంచి న్యూఢిల్లీకి రావడానికి సోనూసూద్ ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో రెండు రోజుల్లో వారికి కాలేయ మార్పిడి చికిత్స కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమైన 39 మంది చిన్నారుల కోసం సోనూసూద్ ఫిలిప్పీన్స్‌కు ప్రత్యేక విమానం పంపించారు. ఆ విమానం మ‌నీలా నుంచి చిన్నారులను తీసుకొని రెండు రోజుల్లో ఢిల్లీ చేరుకోనుంది.

‘ఈ అమూల్యమైన జీవితాలను కాపాడుకుందాం. మరో రెండు రోజుల్లో వాళ్లు భారత్‌కు వస్తారు. 39 ఏంజెల్స్ మీరు మీ బ్యాగ్స్ సర్దుకోండి’ అని సోనూసూద్ ట్విటర్‌లో బదులిచ్చారు. ఆ చిన్నారులంతా ఐదేళ్ల లోపు వాళ్లే. కొంత కాలంగా వారు బైలరీ అట్రీసియా అనే కాలేయ సంబంధ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. న్యూఢిల్లీలోని ఓ హాస్పిటల్‌‌లో వారికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయ‌నున్నారు. చిన్నారులను కాపాడే విష‌యంలో సోనూసూద్ చూపిన ఔదార్యంపై నెటిజ‌న్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోనూసూద్ ట్విటర్ ఖాతా పరిశీలిస్తే.. ఇలాంటి ఔదార్యాలు మరెన్నో కనిపిస్తున్నాయి.





Untitled Document
Advertisements