టీ20ల్లో ఎవర్‌గ్రీన్ హిట్టింగ్: యువరాజ్ 6, 6, 6, 6, 6, 6

     Written by : smtv Desk | Sat, Sep 19, 2020, 05:52 PM

టీ20ల్లో ఎవర్‌గ్రీన్ హిట్టింగ్: యువరాజ్ 6, 6, 6, 6, 6, 6

క్రికెట్ ప్రపంచానికి టీ20 మజాని 2007లో టీ20 వరల్డ్‌కప్ పరిచయం చేయగా.. ఆ క్రేజ్‌ని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన హిట్టింగ్‌తో మరోస్థాయికి తీసుకెళ్లాడు. దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ఆ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యువరాజ్ సింగ్ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదేశాడు. ఆ రికార్డ్‌కి శనివారంతో సరిగ్గా 13 ఏళ్లు.

2007, సెప్టెంబరు 19న డర్బన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 16.4 ఓవర్లు ముగిసే సమయానికి 155/3తో నిలిచిన దశలో యువరాజ్ సింగ్ (58: 16 బంతుల్లో 3x4, 7x6) క్రీజులోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ప్లింటాఫ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా 4, 4 బాదగా.. ప్లింటాఫ్ నోరు జారాడు. దాంతో.. మైదానంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. ఆ కోపం తర్వాత ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ చూపించాడు.

ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదిన యువరాజ్ సింగ్.. టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. అలానే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోవడం ద్వారా టీ20ల్లో వేగంగా అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఆ తర్వాత ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన ప్లింటాఫ్‌కి ఓ సిక్స్‌ బాదిన యువీ.. తర్వాత బంతికే ఔటయ్యాడు. మొత్తంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్ 200/6కే పరిమితమైంది. యువరాజ్ సింగ్ కెరీర్ ఈ ఆరు సిక్సర్లకి ముందు ఆ తర్వాత అనేంతలా సాగింది. 2007 టీ20 ప్రపంచకప్‌ని గెలిచిన భారత్.. ఆ తర్వాత యువరాజ్ సింగ్ దూకుడుతో 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ విజేతగా నిలిచింది. కానీ.. 2014 నుంచి యువీ కెరీర్ గాడి తప్పింది. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్.. ఇటీవల ఆ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించాడు. కానీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి అతనికి అనుమతి లభించడం లేదు. భారత్ తరఫున 304 వన్డేలు, 58 టీ20లు, 40 టెస్టులని యువరాజ్ సింగ్ ఆడాడు.





Untitled Document
Advertisements