లేడీస్ ట్రబుల్స్‌పై సమంత కామెంట్స్

     Written by : smtv Desk | Sat, Sep 19, 2020, 05:54 PM

లేడీస్ ట్రబుల్స్‌పై సమంత కామెంట్స్

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్, సినిమా విశేషాలు పంచుకోవడంతో పాటు ఈ సమాజంలోని ఎన్నో అంశాలపై స్పందిస్తూ ఉంటుంది అక్కినేని కోడలు సమంత. సమాజంలోని అసమానతలు, జరుగుతున్న అన్యాయాలపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళా సమస్యల పరిష్కారంపై స్పందించడంలో అందరికంటే ముందే ఉండే సామ్.. తాజాగా ఓ కార్టూన్ బొమ్మ షేర్ చేస్తూ లేడీస్ ట్రబుల్స్‌ ఎలా ఉంటాయో వివరించింది. ఈ మేరకు మహిళల్లో ఆలోచనలు రేకెత్తించేలా పోస్ట్ పెట్టింది.

మహిళలు ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా కొన్ని ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయని, ఎందుకిలా? మహిళలకే ఈ పరిస్థితి ఏమిటి? అంటూ సగటు మానవుడిలో ఆలోచన కలిగించే విషయాలు ప్రస్తావించింది సమంత. ''నేను అతనికి సరిపోతానా? అది నా తప్పేనేమో? నేను బరువు తగ్గాలేమో? నేను వారిని చూడటం మానేయాలి.. అప్పుడే అతనంటే నాకు ఇంట్రెస్టెంట్ లేదని అర్థమవుతుంది? నేను ఈ జాబ్‌కు సరిపోతానా? నా గురించి జనాలు ఏమనుకుంటున్నారో? నేను మాట్లాడితే వాళ్ళు నమ్ముతారా? అర్దరాత్రి నేను ఇంటికి పోలేనేమో? నా బట్టలు మరీ కనిపించేలా ఉన్నాయా? అనే ప్రశ్నలు వెంటాడుతూ ఉంటాయని ఓ కార్టూన్ బొమ్మ ద్వారా వెల్లడించింది.

నువ్వు అందరిలాంటి దానివి కాదు.. నువ్వు నవ్వుతుంటే అందంగా ఉన్నావ్? నీ పెళ్లి ఎప్పుడు? నీ కుటుంబాన్ని ఎప్పుడు ఏర్పరుచుకుంటావ్? ఆడదానిలా ప్రవర్తించు.. ఇలా ఎన్నో కోణాల్లో నిత్యం సవాలక్ష ప్రశ్నలు ఆడవాళ్లకే ఎదురవుతుంటాయని ఓ అమ్మాయి బొమ్మ గీసి ఆవేదన చెందింది సమంత. ఈ మేరకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ మహిళకైనా సరే ఇవే సమస్యలు.. ఎందుకు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఈ పోస్ట్ జనాన్ని ఆలోచనలో పడేసింది. పర్ఫెక్ట్ సమంత.. బాగా అడిగారు అంటూ రియాక్ట్ అవుతున్నారు ఇది చూసిన నెటిజన్లు.

ఇకపోతే పెళ్లి తర్వాత వరుస విజయాలతో సత్తా చాటుతున్న సమంత.. బిజినెస్ రంగంలోనూ దూసుకుపోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు చిన్నపిల్లల కోసం 'ఏకం' ప్రీ స్కూల్ రెడీ చేసింది. దీంతో పాటు మహిళల దుస్తుల అమ్మకానికి సంబంధించిన ఆన్‌లైన్ స్టోర్ స్టార్ట్ చేస్తోంది. 'సాకీ' పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది సమంత.





Untitled Document
Advertisements