పాపులారిటీ విషయంలో ధోనీపై గవాస్కర్ కామెంట్స్

     Written by : smtv Desk | Sun, Sep 20, 2020, 03:32 PM

పాపులారిటీ విషయంలో ధోనీపై గవాస్కర్ కామెంట్స్

15 ఏళ్లపాటు అభిమానులను అలరించిన ధోనీ.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. వన్డే, టీ20 వరల్డ్ కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో ధోనీ తిరుగులేని కెప్టెన్ అనిపించుకున్నాడు. మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా మహీ రికార్డులకెక్కాడు. వికెట్ల వెనుకాల మెరుపు వేగంతో కదలడంలో.. క్యాచ్‌లను అందుకోవడంలో క్షణాల్లో స్పందిస్తూ డీఆర్ఎస్ రివ్యూలు కోరడంలో.. ఆటగాళ్లను తగిన విధంగా ఉపయోగించుకోవడంలో మహీకి ఎవరూ సాటిలేరు.

ధోనీ ఆటతీరు, కెప్టెన్సీకి, వ్యూహ రచనకు ఫిదా కాని వారంటూ ఉండరూ. ఐపీఎల్‌తో ధోనీ క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్.. చెన్నై అంటే ధోనీ అనేంతగా క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో సింగం లుక్‌తో ఎంట్రీ ఇచ్చిన ధోనీ అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. రైనా, హర్భజన్ లేకున్నా.. ముంబైపై జట్టును నడిపించిన తీరు ఆకట్టుకుంది.

మన దేశంలో క్రికెటర్ల పాపులారిటీలో సచిన్, విరాట్ కోహ్లిని ధోనీ దాటిపోయాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న గవాస్కర్.. తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు మాట్లాడుతూ.. ‘‘ధోనీ క్రికెట్ గురించి అంతగా తెలియని రాంచీ నుంచి వచ్చాడు.. అతణ్ని దేశం మొత్తం ప్రేమిస్తుంది. టెండుల్కర్‌ను ముంబై, కోల్‌కతాల్లో ఎక్కువ ఇష్టపడతారు. కోహ్లిని ఢిల్లీ, బెంగళూరుల్లో.. కానీ ధోనీ విషయానికి వస్తే దేశం మొత్తం ఇష్టపడుతుంది’’ అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements