డ్యాడీస్ ఆర్మీని గెలిపించిన బుడ్డోడు

     Written by : smtv Desk | Sun, Sep 20, 2020, 03:36 PM

డ్యాడీస్ ఆర్మీని గెలిపించిన బుడ్డోడు

ఐపీఎల్ 2020 సీజన్‌కి అదిరిపోయే ఆరంభం లభించింది. అబుదాబి వేదికగా శనివారం రాత్రి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగగా.. ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠరేపిన ఈ పోరులో చెన్నై టీమ్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి టీమ్ 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. ఛేదనలో చెన్నై విజయానికి 24 బంతుల్లో 42 పరుగులు అవసరమైన దశలో అంబటి రాయుడు (71: 48 బంతుల్లో 6x4, 3x6) ఔటైపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (10: 5 బంతుల్లో 2x4) కూడా దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకోవడంతో.. ముంబయి మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చేలా కనిపించింది. కానీ.. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన 22 ఏళ్ల శామ్ కరన్ (18: 6 బంతుల్లో 1x4, 2x6) కేవలం ఆరు బంతుల వ్యవధిలోనే చెన్నై చేతిలోకి మ్యాచ్‌ని తెచ్చేశాడు. దాంతో.. ఆఖర్లో డుప్లెసిస్ (58: 44 బంతుల్లో 6x4) పని సులువైంది.

వాస్తవానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ముప్పావు వంతు క్రికెటర్లు.. 30ఏళ్లకి పైబడిన వారే. ఇందులో కొంత మంది ఇప్పటికే ఇంటర్నేషన్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పినవారు కూడా ఉన్నారు. దాంతో.. చెన్నై టీమ్‌ని అందరూ డాడీస్ ఆర్మీ అంటూ ఆటపట్టిస్తుంటారు. అలాంటి జట్టులో 22 ఏళ్ల శామ్ కరన్.. బౌలింగ్‌లో ఒక వికెట్ పడగొట్టడమే కాకుండా రెండు క్యాచ్‌లు అందుకుని.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ దూకుడుగా ఆడి చెన్నై టీమ్‌ని విజయతీరాలకి చేర్చాడు. దాంతో.. చెన్నై టీమ్‌లో శామ్ కరన్‌ని బుడ్డోడిగా చిత్రీకరిస్తూ అభిమానులు తెగ సెటైర్లు పేలుస్తున్నారు.

ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ధోనీ.. సింగం స్టైల్‌లో సరికొత్తగా కనిపించడం అభిమానుల్ని ఆకట్టుకుంది. మరోవైపు రోహిత్ శర్మ ఈ లాక్‌డౌన్‌లో కాస్త ఒళ్లు చేసినట్లు అనిపించడంతో అతనిపై సెటైర్లు పేలుస్తున్నారు. ఇక బౌండరీ లైన్‌ వద్ద అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్న డుప్లెసిస్‌‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుండగా.. భారీ అంచనాలతో అడుగుపెట్టిన ముంబయి టీమ్‌ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో ఆ టీమ్ అభిమానులు నిరాశకి గురవుతున్నారు. ఆఖర్లో ధోనీ కీపర్ క్యాచ్ ఔట్‌గా అంపైర్ ప్రకటించగా.. రివ్యూ కోరిన ధోనీ అంపైర్‌కి ట్విస్ట్ ఇచ్చాడు. బంతి అసలు బ్యాట్‌కి తాకలేదని రిప్లైలో తేలింది. మొత్తంగా ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబయితో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన చెన్నై.. ఈ ఏడాది ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆ ఓటములకి బదులు తీర్చుకోవడంతో చెన్నై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.





Untitled Document
Advertisements