శరీర రంగు పరంగా వివక్ష చూపేలా ప్రకటనలు ఉండరాదు: కేంద్రం

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 12:03 PM

శరీర రంగు పరంగా వివక్ష చూపేలా ప్రకటనలు ఉండరాదు: కేంద్రం

వ్యాపార ప్రకటనలకు సంబంధించి కేంద్రం కీలక సూచనలు చేసింది. శరీర రంగు పరంగా ఏ రకమైన వివక్షను ఎత్తిచూపేలా ప్రకటనలు ఉండరాదని స్పష్టం చేసింది. ఉత్పత్తుల వర్ణన, మోడల్స్‌ హావభావాల పరంగా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఫెయిర్‌నెస్‌, వైట్‌నెస్‌ క్రీమ్‌లను ప్రచారం చేసే వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అంటూ ఆదివారం రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని చౌబే ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉండే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన అంశాలను అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) చూసుకుంటుందని లిఖితపూర్వకంగా వెల్లడించారు. చర్మం రంగు పరంగా ప్రచారం చేసే ప్రకటనల వల్ల సమాజంలో వివక్షను ప్రోత్సహించడమేనని అన్నారు. ప్రత్యేకంగా ముదురు రంగు చర్మం ఉన్న వ్యక్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చూపించరాదు. ఇది వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

ముదురు రంగు చర్మం ఉన్న వ్యక్తులను ఏవిధమైన ప్రతికూలత, హీనమైనవిగా లేదా జీవితంలో ఏ కోణంలోనూ విజయవంతం కాని విధంగా ముఖ్యంగా పెళ్లి సంబంధాలు, ఉద్యోగ నియామకానికి ఆకర్షణీయంగా ఉండటాన్ని విస్తృతంగా చూపకూడదు అని మంత్రి చెప్పారు. వినియోగదారుల భద్రత చట్టం-2019లోని నిబంధనల ప్రకారం.. ఏదైనా ప్రకటన తప్పుడు లేదా తప్పుదోవ పట్టించేదిగా ఉందని, వినియోగదారుడి ప్రయోజనం లేదా హక్కులకు విరుద్ధంగా ఉందని దర్యాప్తులో తేలితే వాటిని నిలిపివేయడానికి లేదా సవరించడానికి అధికారం ఉంటుంది.

మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటివరకు 16.79 లక్షల మందికి నివాస ధ్రువపత్రాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రజల కదలికల మీద ఎలాంటి నియంత్రణలూ లేవని స్పష్టం చేశారు. పారామిలటరీ సిబ్బందిలో 32,238 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు లోక్‌సభలో మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు.





Untitled Document
Advertisements