వాహనదారులకు శుభవార్త...కేంద్రం నుంచి స్క్రాప్ పాలసీ

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 12:53 PM

వాహనదారులకు శుభవార్త...కేంద్రం నుంచి స్క్రాప్ పాలసీ

కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకువచ్చేందుకు రెడీ అయ్యింది. ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న స్క్రాప్ పాలసీ త్వరలోనే అమలులోకి రానుంది. మోదీ సర్కార్ ఈ పాలసీకి సంబంధించిన సమాచారాన్ని పార్లమెంట్‌లో వెల్లడించింది వెహికల్ స్క్రాపింగ్ పాలసీకి సంబంధించిన కేబినెట్ నోట్ రెడీ అయ్యిందని రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు.

కండీషన్‌లో లేనటువంటి, పాత వెహికల్స్‌ను తొలగించడానికి ఈ స్క్రాప్ పాలసీ ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ఈ కొత్త పాలసీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగనుందని పేర్కొన్నారు. వాహన పరిశ్రమ జోరందుకుంటుందని, మళ్లీ కొత్త వెహికల్స్ కొనుగోలు పెరుగుతుందని తెలిపారు.

స్క్రాప్ పాలసీ కారణంగా కస్టమర్లు కొత్త వాహనాలను ఏకంగా 30 శాతం తక్కువ ధరకే కొనుగోలు చేసే ఛాన్స్ అందుబాటులోకి వస్తుందని వీకే సింగ్ పేర్కొన్నారు. పాత వెహికల్స్‌ రోడ్డుపై తిరగకపోవడంతో కాలుష్యం కూడా 25 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. ఇంకా స్క్రాప్ సెంటర్లలో భారీ స్థాయిలో ఉపాధి కూడా లభిస్తుందని తెలిపారు.

స్క్రాప్ సెంటర్‌కు పాత వెహికల్స్‌ను విక్రయిస్తే కొత్త కారు రిజిస్ట్రేషన్ ఉచితంగానే ఉంటుందని ఆయన తెలిపారు. అంటే మీరు కొత్తగా కారు కొంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించక్కర్లేదు. దేశంలో దాదాపు 2.8 కోట్ల వెహికల్స్‌ స్క్రాప్ పాలసీ కిందకు వస్తాయనే అంచనాలున్నాయి.

అంతేకాకుండా పాత వెహికల్స్ రీసైక్లింగ్‌లో కంపెనీలకు కూడా అల్యూమినియం, ప్లాస్టిక్, స్టీల్ వంటి వాటితో తయారైన వెహికల్ పార్ట్స్ చవక ధరకే లభిస్తాయని వీకే సింగ్ తెలిపారు. త్వరలోనే ఈ పాలసీ కేబినెట్ ముందుకు వెళ్లొచ్చు. తర్వాత ప్రభుత్వ ఆమోదం తర్వాత పాలసీ అమలు వేగవంతంగానే ఉంటుంది. ఈ కొత్త పాలసీ వల్ల 15 ఏళ్లకు పైన వయసు కలిగన పాత వెహికల్స్ రోడ్లపై తిరగకూడదు.





Untitled Document
Advertisements