భారత నౌకదళ చరిత్రలో తొలిసారి...యుద్ధ నౌకల్లో మహిళా అధికారులు!

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 05:12 PM

భారత నౌకదళ చరిత్రలో తొలిసారి...యుద్ధ నౌకల్లో మహిళా అధికారులు!

భారత నౌకదళంలో మరో కొత్త శకం మొదలవుతోంది. లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధ నౌకల్లో తొలిసారి మహిళా అధికారులను నియమించి, నౌకాదళం చరిత్ర సృష్టించబోతుంది. ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో మహిళా అధికారులు విధులు నిర్వర్తిస్తున్నా, వివిధ కారణాల వల్ల యుద్ధ నౌకల్లో మహిళలను నియమించలేదు. ప్రస్తుతం సబ్ లెఫ్టినెంట్స్ కుముదిని త్యాగి, రితి సింగ్‌లకు అవకాశం దక్కింది.

నేవీ బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, ఇంటెలిజెన్స్, నిఘా పునఃపరిశీలన (ఐఎస్ఆర్) పేలోడ్‌లతో సహా అనేక సెన్సార్‌ల ఆపరేటింగ్‌లో ఈ ఇద్దరూ శిక్షణ తీసుకున్నారు. నేవీలో చేరనున్న ఎంహెచ్-60 ఆర్ హెలికాప్టర్లను మహిళా అధికారులు నడపనున్నారు. ప్రపంచంలో అత్యంత అధునాతన బహుళ ప్రయోజన హెలికాప్టర్లుగా పరిగణించే ఎంహెచ్-60ఆర్‌లు శత్రు నౌకలు, జలాంతర్గాములను గుర్తించడానికి తోడ్పతాయి. 2018లో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ లాక్‌హీడ్‌-మార్టిన్‌ నిర్మించిన ఈ హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేశారు.

ఇటీవల వైమానిక దళంలో చేరిన అధునాతన రాఫేల్ యుద్ధ విమానాలు నడపడానికి ఒక మహిళా ఫైటర్ పైలట్‌ను షార్ట్‌లిస్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతున్న వేళ ఇద్దరు మహిళా అధికారులను యుద్ధ నౌకల్లో నియమిస్తూ నేవీ నిర్ణయం తీసుకుంది. రఫేల్ యుద్ధ విమానాల కార్యాచరణ ప్రకనటపై అస్పష్టత నెలకుంది. ఫ్రాన్స్ తయారుచేసిన ఈ యుద్ధ విమానాలు ఐఏఎఫ్ అమ్ములిపొదిలో ఉన్న అత్యంత అధునాతనమైనవి.

ఇక, 2016లో లెఫ్టినెంట్ భవన్న కాంత్, లెఫ్టినెంట్ అవని చతుర్వేది, లెఫ్టినెంట్ మోహనా సింగ్‌లు వైమానిక దళంలో చేరిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌లుగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతానిక 10 మంది ఫైటర్ పైలట్లతో సహా 1,875 మంది మహిళలు వాయుసేవలో ఉన్నారు. సుఖోయ్- 30 ఎంకేఐ సహా వివిధ వివిధ యుద్ధ విమానాల్లో 18 మంది మహిళా నావిగేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు.





Untitled Document
Advertisements