RCB వాషింగ్టన్ సుందర్‌ను ఓపెనర్‌గా పంపితే బెటర్: గంభీర్

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 06:50 PM

RCB వాషింగ్టన్ సుందర్‌ను ఓపెనర్‌గా పంపితే బెటర్: గంభీర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఐపీఎల్ మూడో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌‌లో ఇరు జట్లు ఏయే ఆటగాళ్లను ఫైనల్ ఎలెవన్‌లో ఉంటారు, ఫ్రాంచైజీలు ఎలాంటి ప్రయోగాలు చేస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్‌కు ఓపెనింగ్ విషయంలో రకరకాల ఛాయిస్‌లు ఉన్నాయి. ఆరోన్ ఫించ్, కర్ణాటక ఓపెనర్ దేవదత్త్ పడిక్కల్‌ను బెంగళూరు వేలంలో దక్కించుకుంది. దీంతో వీరిద్దరితో ఓపెనింగ్ చేసే అవకాశం బెంగళూరు జట్టుకు ఉంది.

గత సీజన్లో పార్థీవ్ పటేల్, కెప్టెన్ విరాట్ కోహ్లి ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ చేశారు. మొయిన్ అలీ, షిమ్రాన్ హెట్‌మెయర్‌లతోనూ ఓపెనింగ్ చేయించినా.. వారు రాణించలేదు. ఈ సీజన్లో ఆర్సీబీ ఓపెనింగ్ విషయమై గౌతమ్ గంభీర్ అనూహ్యమైన సూచన చేశాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను ఓపెనర్‌గా దింపాలని గౌతీ సూచించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో.. సునీల్ నరైన్‌‌తో ఓపెనింగ్ చేయించిన గంభీర్ అద్భుతమైన ఫలితం పొందాడు. పవర్ ప్లేలో చెలరేగిన నరైన్.. కోల్‌కతాకు మంచి ఓపెనింగ్ అందించాడు. కోహ్లి కూడా సుందర్‌ను ఓపెనర్‌గా ఉపయోగించుకుంటే చూడాలనుకుంటున్నట్లు గంభీర్ తెలిపాడు.

‘సుందర్ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. ఏ స్థానంలో ఆడతానే దాని మీద అతడి ఆటతీరు ఆధారపడుతుంది. ఆర్సీబీ అతడ్ని ఓపెనర్‌గా పంపి స్వేచ్ఛగా వదిలేయాలి. విలువైన పరుగులను రాబట్టే సామర్థ్యం అతడికి ఉంది. ఆట ఏ దశలోనైనా అతడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలడు’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ఆల్‌రౌండర్ అయిన సుందర్‌కు ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఎక్కువగా బ్యాటింగ్ చేసి తనను తాను నిరూపించుకునే ఛాన్సులు రాలేదు. మూడేళ్ల ఐపీఎల్ కెరీర్‌లో 21 మ్యాచ్‌ల్లో కేవలం 75 రన్స్ మాత్రమే చేయగలిగాడు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓ సెంచరీతోపాటు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.





Untitled Document
Advertisements