పొలాల్లో హెలికాప్టర్ కూలి పైలట్ దుర్మరణం

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 06:57 PM

పొలాల్లో హెలికాప్టర్ కూలి పైలట్ దుర్మరణం

హెలికాప్టర్ కూలిన ఘటనలో పైలట్ దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అజామ్‌గర్‌లో సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం 11.20 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అజామ్‌గర్ సమీపంలోని సంజయ్‌పూర్‌లో పంట పొలాల మధ్య హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో చాపర్‌లో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు హెలికాప్టర్ క్రాష్ అవడానికి ముందే కిందకి దూకేశారు.

హెలికాప్టర్ కూలిన ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే అజామ్‌గర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ శిక్షణకు సంబంధించిందని వారు తెలిపారు. హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలియగానే స్థానికులు సంఘటనా స్థలానికి పరుగెత్తుకొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సహాయ కార్యకలాపాల్లో పాల్పంచుకున్నారు.

ప్రమాదానికి గురైన హెలికాప్టర్ అమెథీలోని ఇందిరా గాంధీ జాతీయ ఉడాన్ అకాడెమీ (IGRUA)కు చెందినదిగా పీటీఐ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ విమానాలను నడిపించడంలో శిక్షణ అందిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.





Untitled Document
Advertisements