తెలుగు ప్రజలకు అలర్ట్: పోలీస్ ఫొటోతో మెసేజ్ వస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 09:16 PM

తెలుగు ప్రజలకు అలర్ట్:  పోలీస్ ఫొటోతో మెసేజ్ వస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమాయక ప్రజలను మోసగించి డబ్బు గుంజడంలో ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరగాళ్ల దృష్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై పడింది. ఏకంగా పోలీసు వ్యవస్థనే వీరు సవాల్ చేస్తున్నారు. పోలీసుల పేర్లతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లు సృష్టించి వారి స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్దే డబ్బు కాజేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారిని గుర్తించి వారి వాల్ నుంచి వ్యక్తిగత ఫొటోలు తస్కరించి.. వాటితో నకిలీ అకౌంట్లు ప్రారంభించి మోసాలకు పాల్పడుతున్నారు.

ఇటీవలే ఎంతో ప్రాచుర్యం ఉన్న తెలంగాణలోని నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌కు సైతం సైబర్ నేరగాళ్ల సెగ తగిలింది. ఏకంగా ఆయన పేరుతో నకిలీ అకౌంట్ తెరచి తన భార్య అకౌంట్‌కి రూ.20 వేలు పంపాలంటూ ఫేస్‌బుక్‌లోనే మెసేజ్‌లు చేశారు. అలాగే తెలంగాణ ఉమెన్ సేఫ్టీ అడిషనల్ డీజీ స్వాతీ లక్రా పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ సృష్టించారు. ఈ విధంగా ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. అయితే తన ఫేస్‌బుక్ అకౌంట్ ఇదేననింటూ స్వాతి లక్రా వివరణ ఇచ్చారు.

స్వాతి లక్రాతాజాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురికి సైతం సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో 10 మంది సీఐ, ఎస్సైల పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్ల తెరచి మోసాలకు తెరలేపారు. ఫేస్ బుక్, వాట్సాప్ ప్రొఫైల్‌లో పోలీసు అధికారుల ఫోటోలు పెట్టి డబ్బులు దండుకుంటున్నారు. వారు అడిగేది కూడా రూ. 5- 6 వేలు కావడంతో కొందరు కాదనలేక ఇచ్చేస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్లకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పోలీసు అధికారుల బంధువులు, స్నేహితులు పంపారు. దీనిపై పోలీసులు అప్రమత్తమయ్యారు. సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించారు. సైబర్ నేరగాళ్ల మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ నెట్‌వర్క్ ఢిల్లీ నుంచి నడుపుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ తమకున్న సోషల్ మీడియా అకౌంట్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి. మీ సోషల్ మీడియా అకౌంట్ల (ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రాం..)లో ఓసారి సెర్చ్ బార్‌తో తన పేరును టైప్ చేసి చూడండి. మీ ఫొటోతో గాని, లేక మీ కుటుంబ సభ్యుల ఫొటోలతో మీ ప్రమేయం లేకుండా ఏవైనా అకౌంట్ ఉందేమో చూడండి. ఒక వేళ మీ పేరుపై మీది లేక మీ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల ఫొటోతో ఏదైనా అకౌంట్ ఉంటే అందులో ఫ్రెండ్ లిస్ట్ చూడండి. మీకు తెలిసిన వ్యక్తులే ఆ లిస్ట్‌లో ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఎందుకంటే వ్యక్తిగత సమాచారంతో మీ అనుమతి లేకుండా మీకు తెలిసిన వ్యక్తులతో సంభాషణలు చేస్తున్నాడంటే కచ్చితంగా దురద్దేశంతోనే అయి ఉండొచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.





Untitled Document
Advertisements