కరోనా మృతుదేహాన్ని పీక్కుతున్న ఎలుకలు

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 12:52 PM

కరోనా మృతుదేహాన్ని పీక్కుతున్న ఎలుకలు

ప్రైవేట్ హాస్పిటళ్లలో నిర్లక్ష్యానికి పరాకాష్టగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కరోనాతో చనిపోయిన ఓ రోగి మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. ఓ కన్నును కూడా తినేశాయి. రోగి బంధువులు హాస్పిటల్ ఎదుట నిరసనకు దిగడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇండోర్‌లో అన్నపూర్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐత్వారియా బజార్‌లో నివాసం ఉండే 87 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల కిందట కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆయన ఆరోగ్యం విషమించి మరణించినట్లు కుటుంబసభ్యులకు సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం సమాచారం అందించారు. లక్ష రూపాయల ఫీజు చెల్లించి, మృతదేహాన్ని తీసుకెళ్లాలని.. మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు.

సోమవారం ఉదయం రోగి కుటుంబసభ్యులు మృతదేహాన్ని తీసుకోవడానికి హాస్పిటల్‌కు వచ్చారు. తమకు అప్పగించిన మృతదేహం చిధ్రంగా ఉండటాన్ని వారు గుర్తించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే హాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. మృతదేహం ఎలుకలు కొరకడం వల్లే చిధ్రమైందని మృతుడి కుమార్తె ప్రాచీ జైన్ ఆరోపించారు.

తన తండ్రి ఆరోగ్యం ఆదివారం సాయంత్రం వరకు నిలకడగానే ఉందని.. రాత్రి 8 గంటల సమయంలో ఆరోగ్యం క్షీణించిందని చెప్పి హాస్పిటల్ సిబ్బంది ఏవో పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ప్రాచీ జైన్ తెలిపారు. అర్ధరాత్రి తర్వాత తన తండ్రి మరణించినట్లు చెప్పారని వెల్లడించారు. హాస్పిటల్ సిబ్బంది తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వారికి నచ్చజెప్పి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇండోర్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌లో మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతదేహం అస్థిపంజరంగా మారిన ఘటన మరువక ముందే తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాజా యశ్వంత్‌రావ్ హాస్పిటల్‌ మార్చురీలో ఓ మృతదేహాన్ని స్ట్రెచర్‌పై ఉంచి 11 రోజుల పాటు అలాగే వదిలేయడంతో స్కెల్టన్‌గా మారిన విషయం తెలిసిందే. కుళ్లి, కంపు కొడుతున్నా.. మార్చురీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో చివరికి అది అస్థిపంజరంగా మారింది. అది భయం గొల్పేలా ఉండటంతో కొంత మంది సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.





Untitled Document
Advertisements