వ్యవసాయ బిల్లుల వివాదం: డిప్యూటీ ఛైర్మన్ నిరాహార దీక్ష!

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 04:12 PM

వ్యవసాయ బిల్లుల వివాదం: డిప్యూటీ ఛైర్మన్ నిరాహార దీక్ష!

రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులకు సంబంధించిన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. ఆదివారం (సెప్టెంబర్ 20) కొంత మంది సభ్యులు సభలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు.

‘ఆదివారం సభలో జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నేను మానసిక వేదనకు గురయ్యాను. గత రెండు రోజులుగా నాకు నిద్ర కూడా పట్టడం లేదు. ప్రజాస్వామ్యం ముసుగులో విపక్ష సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారు. ఛైర్మన్‌ స్థానాన్ని బెదిరించేందుకు ప్రయత్నించారు. సభ్యుల చర్యలతో సభా గౌరవానికి నష్టం వాటిల్లింది’ అని లేఖలో హరివంశ్‌ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సభ్యులు రూల్ బుక్‌ను చించివేసి తన పైకి విసిరారని, కొంత మంది బల్లలపై ఎక్కి నిలబడ్డారని హరివంశ్ సింగ్ పేర్కొన్నారు. తనను అనుచిత పదజాలంతో దూషించారని తెలిపారు. ‘ఇదంతా నాకు పదే పదే గుర్తొస్తుంది. నిద్ర పట్టడం లేదు’ అంటూ ఆయన తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు.. 8 మంది సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి. వారిపై సస్పెన్షన్‌ వేటు వేయడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. వెంటనే వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి. దీంతో పాటు ప్రైవేట్‌ వ్యక్తులు రైతుల నుంచి కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంటను కొనుగోలు చేయొద్దన్న నిబంధనను బిల్లులో చేర్చాలని కోరాయి. ఈ డిమాండ్లను పరిష్కరించే వరకు వరకు సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తూ వాకౌట్‌ చేశాయి.

సభ్యులు సస్పెండ్‌‌కు గురి కావడం తమకూ ఇష్టం లేదని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సభ్యుల అనుచిత ప్రవర్తన వల్లే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. విపక్షాలు వెంటనే సభకు రావాలని వెంకయ్య కోరారు.





Untitled Document
Advertisements