జగన్ కు సలహా ఇచ్చే స్థాయి బీజేపీ నేతలకు ఉందా?

     Written by : smtv Desk | Wed, Sep 23, 2020, 05:10 PM

డిక్లరేషన్ పై సంతకం పెట్టి, సతీసమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని ముఖ్యమంత్రి జగన్ దర్శించుకోవాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అత్యధిక ఓట్లను సాధించిన జగన్ కు సలహా ఇచ్చే స్థాయి బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని భార్యను తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమని చెప్పండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటా ఓట్ల కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. నోటా కంటే ఎక్కువ ఓట్లు ఎలా తెచ్చుకోవాలి అనే విషయంపై బీజేపీ నేతలు ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు.

వైసీపీలో ఎవరిని ఉంచాలి? ఎవరిని తొలగించాలి? అనే విషయాలను జగన్ కు బీజేపీ నేతలు చెప్పాల్సిన అవసరమేముందని నాని ప్రశ్నించారు. ఎవరి పార్టీ వ్యవహారాలు వారు చూసుకుంటే మంచిదని అన్నారు. సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని తాము అంటే... ఆయనను పదవి నుంచి తొలగిస్తారా? అని ప్రశ్నించారు. పది మందిని వెంట పెట్టుకెళ్లి అమిత్ షాను, కిషన్ రెడ్డిని తొలగించాలంటే తొలగిస్తారా? అని అడిగారు. తిరుమలలో డిక్లరేషన్ ను తొలగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని నాని చెప్పారు.





Untitled Document
Advertisements