పొగతాగే అలవాటు ఉన్నవారికి పాజిటివ్ వస్తే ఎంతో ప్రమాదకరం

     Written by : smtv Desk | Wed, Sep 23, 2020, 06:09 PM

పొగతాగడం హానికరమని అందరికీ తెలిసిందే. ఊపిరితిత్తులపై ప్రత్యక్ష ప్రభావం చూపే ధూమపానం పరోక్షంగా ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పొగతాగే అలవాటు ఉన్నవారికి పాజిటివ్ వస్తే ఎంతో ప్రమాదకరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగానే కరోనా వైరస్ దేహంలోని కీలక అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని, ధూమపానంతో దెబ్బతిన్న అవయవాలపై అది చూపే ప్రభావం ప్రాణాంతకం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

పొగతాగే అలవాటుతో దెబ్బతిన్న శరీరం... కరోనా మహమ్మారిపై సరైన రీతిలో పోరాడలేదని తెలిపారు. పైగా స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లకు నోటికి, వేళ్లకు వైరస్ అంటే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టే, స్మోకర్లు పొగతాగడాన్ని దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఒక్కసారి ధూమపానం మానేస్తే ఆ మరుక్షణం నుంచి శరీరం దెబ్బతిన్న అవయవాలను మరమ్మతు చేయడం ప్రారంభిస్తుందని, కరోనాను ఎదుర్కోవడంలో ఇది ఎంతో కీలకమని నిపుణులు వివరించారు.

ప్రధానంగా శ్వాస వ్యవస్థను లక్ష్యంగా చేసుకునే కరోనా వైరస్ స్మోకర్లకు సోకిందంటే వారి ఊపిరితిత్తులు దారుణంగా దెబ్బతింటాయని తెలిపారు. కరోనా కారణంగా సంభవించే మరణాల్లో అత్యధికంగా శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడేవాళ్లు, హృదయ సంబంధ సమస్యలున్నవాళ్లు, క్యాన్సర్, ఇతర సమస్యలతో బాధపడేవాళ్లే ఉంటారని, ఈ వ్యాధులన్నీ స్మోకింగ్ తో సంబంధమున్నవేనని పేర్కొన్నారు. ధూమపానం మానేయడం ఎంతో కష్టమే అయినా, మానేయడానికి ఇంతకంటే అత్యవసర సమయం మరేదీ ఉండదన్నది నిపుణుల మాట!





Untitled Document
Advertisements