బ్యాంకుకు వెళ్లి అమౌంట్ చెక్ చేసిన బాలికకు షాక్...అకౌంట్లో పది కోట్లు!!

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 11:08 AM

బ్యాంకుకు వెళ్లి అమౌంట్ చెక్ చేసిన బాలికకు షాక్...అకౌంట్లో పది కోట్లు!!

తన అకౌంట్లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి వచ్చిన ఓ బాలిక బ్యాంక్ సిబ్బంది చెప్పిన సమాధానంతో షాక్‌కు గురైంది. ఎందుకంటే ఆమె ఖాతాలో రూ.10 కోట్లు ఉన్నాయి మరి. నిరుపేద కుటుంబానికి చెందిన, చదువు కూడా రాని ఆ అమ్మాయి బ్యాంక్ ఖాతాలోకి అంత భారీ స్థాయిలో సొమ్ములు ఎక్కడ నుంచి వచ్చి పడ్డాయి. పోలీసు అధికారులు ఇప్పుడు ఈ విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారు. తన ఖాతాలో కోట్ల రూపాయల సొమ్ములు ఉన్నాయని తెలియగానే.. అత్యాశకు పోకుండా ఆ అమ్మాయి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. ఉత్తర్ ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

బల్లియా జిల్లాకు చెందిన 16 ఏళ్ల సరోజ్ అనే అమ్మాయికి అలహాబాద్ బ్యాంక్ శాఖలో ఖాతా ఉంది. కొన్ని రోజుల కిందట ఆ బాలిక తన బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ గురించి ఆరా తీయడానికి వచ్చింది. సదరు ఖాతాలో రూ.9.99 కోట్లు ఉన్నాయని చెప్పడంతో ఆమె షాక్‌కు గురైంది. ఆ తర్వాత కాసేపటికే తేరుకొని బన్స్‌దిహ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అలహాబాద్ బ్యాంక్ శాఖలో 2018లో తాను బ్యాంక్ ఖాతాను తెరిచినట్లు సదరు బాలిక చెప్పింది. రెండేళ్ల కిందట కాన్పూర్ నుంచి ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసినట్లు తెలిపింది. తన పేరు నీలేశ్ కుమార్ అని చెప్పినట్లు గుర్తు చేసుకుంది. ప్రధాన్‌ మంత్రి ఆవాస్ యోజన కింద తన ఖాతాలోకి నిధులను బదిలీ చేస్తున్నామని.. ఇందు కోసం కొన్ని డాక్యుమెంట్లు అవసరమని అతడు చెప్పినట్లు వివరించింది.

నీలేశ్ తన వద్ద నుంచి ఆధార్ కార్డు, ఫొటోతో పాటు కొన్ని వివరాలు తీసుకున్నాడని బాలిక తెలిపింది. ప్రస్తుతం అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన కింద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరి అకౌంట్లోనూ జమ కాలేదని.. ఈ ఘటన వెనుక ఏదో కుట్ర దాగి ఉందని పోలీసులు చెబుతున్నారు. బాలిక బ్యాంకు ఖాతాను సైబర్‌ క్రైం దొంగలు వాడుకుంటున్నారేమో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements